చిన్నపాటి ఆటంకాలు ఎదురైతే చాలు..చేస్తున్న, చేసే పని మధ్యలో ఎగ్గొట్టడానికి ప్రయత్నించేవారు చాలామందే ఉంటారు. కానీ ఈ చీమలు అలా చేయలేదు. ఐకమత్యంతో అనుకున్నది సాధించి మనుషులకు గుణపాఠాన్ని నేర్పించాయి. పిట్టగోడపై వెళుతున్న చీమలదండుకు మధ్యలో ఖాళీ ప్రదేశం కనిపించింది. దాన్ని దాటి అటువైపుకు ఎలా వెళ్లాలో వాటికి అర్థం కాలేదు. అలా అని వెనక్కు తిరిగి వెళ్లనూలేవు. ఏదేమైనా అవతలి గట్టుకు చేరుకోవాలనుకున్నాయి. అనుకున్నదే తడవుగా చేయి చేయి కలిపాయి. ఒక్కొక్కటిగా కలిసి గాలిలోనే వంతెనలా ఏర్పడ్డాయి. పట్టు వదలని విక్రమార్కునిలా చీమలు అనుకున్న పని సాధించి, ఐకమత్యమే మహా బలం అన్న మాటకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచాయి.
కలిసికట్టుగా ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించిన చీమలదండు వీడియోను ఐపీఎస్ అధికారి స్వాతి లక్రా ట్విటర్‌లో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు వాటి ఐకమత్యానికి అబ్బురపడుతున్నారు. చీమలను చూసైనా మనుషులు కాస్త నేర్చుకుంటే బాగుంటుంది అని ఓ నెటిజన్ అభిప్రాయపడ్డాడు. కలసికట్టుగా పనిచేస్తే ఏదైనా సాధించవచ్చని చీమలు మరోసారి నిరూపించాయని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. కాగా పలుసార్లు జంతువుల మనుషులకు పాఠాలు నేర్పే వీడియోలు వైరల్‌గా మారాయి. ఓ కోతి తన దాహాన్ని తీర్చుకున్న తర్వాత కుళాయిని కట్టేసిన వీడియో అందర్నీ ఆలోచింపజేసేలా చేసింది. ఇక ఓ ఏనుగు రోడ్డుపై పడి ఉన్న వ్యర్థ పదార్థాలను చెత్తడబ్బాలోకి విసిరేసి శభాష్ అనిపించుకున్న సంగతి తెలిసిందే!
Comments
Please login to add a commentAdd a comment