చండీగఢ్: ఓ వైపు గృహిణిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరో వైపు ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసు పరీక్షలో ఏకంగా రెండో ర్యాంకుతో సత్తాచాటారు చండీగఢ్‌కు చెందిన అను కుమారి(31). నాలుగేళ్ల కుమారుడిని చూసుకుంటూనే రోజుకు 10 నుంచి 12 గంటల పాటు చదువుతూ రెండో ప్రయత్నంలోనే రెండో ర్యాంకు సాధించారు. ఆమె భర్త వ్యాపారవేత్త. ఆమె దిల్లీ విశ్వవిద్యాలయం నుంచి భౌతికశాస్త్రంలో బీఎస్సీ పూర్తి చేశారు. నాగ్‌పుర్‌లోని ఐఎంటీ నుంచి ఎంబీఏ చేశారు. 2016లో తొలిసారి ప్రయత్నించారు. కేవలం రెండు నెలలు మాత్రమే చదివి పరీక్ష రాశారు. అయితే ప్రిలిమ్స్‌లో ఒక్క మార్కుతో అర్హత కోల్పోయారు. దీంతో మళ్లీ ప్రయత్నించి ఏకంగా రెండో ర్యాంకు దక్కించుకున్నారు. తాను సివిల్స్‌కు సన్నద్ధమైన గ్రామంలో పేపర్ కూడా ఉండదని, ఆన్‌లైన్ సహాయంతోనే సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యానని పేర్కొన్నారు.
జీవితంలో ఏదైనా సాధించాలంటే దృఢసంకల్పం అవసరం అని, అలా ఉంటే విజయం సాధించకుండా ఎవ్వరూ ఆపలేరని అన్నారు. ఐఏఎస్ అధికారిణిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మహిళల భద్రతే తన ప్రధాన లక్ష్యమన్నారు. హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టార్ అను కుమారికి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. అను కుమారి నుంచి హరియాణా అమ్మాయిలు స్ఫూర్తి పొందుతారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. యూపీఎస్సీ ఫలితాల్లో మొత్తం 990 మంది వివిధ సర్వీసులకు ఎంపిక కాగా, వీరిలో 750 మంది పురుషులు, 240 మంది మహిళలు ఉన్నారు. యూపీఎస్సీ టాప్ 25 జాబితాలో 8 మంది మహిళలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment