అనుసంధానంతోనే ఈశాన్యం అభివృద్ధి | Anusandhanantone northeast development | Sakshi
Sakshi News home page

అనుసంధానంతోనే ఈశాన్యం అభివృద్ధి

Published Tue, Dec 2 2014 3:10 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

అనుసంధానంతోనే ఈశాన్యం అభివృద్ధి - Sakshi

అనుసంధానంతోనే ఈశాన్యం అభివృద్ధి

  • నాగాలాండ్ హార్న్‌బిల్ ఉత్సవాల్లో ప్రధాని వరాలు
  • రైల్వే లైన్ల కోసం రూ. 28 వేల కోట్లు; 2జీ సేవలకు రూ. 5 వేల కోట్లు
  • ఓటీపీసీ విద్యుత్ ప్రాజెక్ట్ జాతికి అంకితం
  • కోహిమా/అగర్తలా: ఈశాన్య రాష్ట్రాలపై ప్రధాని నరేంద్ర మోదీ వరాల జల్లు కురిపించారు.  ఈ ప్రాంతంలో ప్రయాణ మార్గాలు, టెలికమ్యూనికేషన్లను అభివృద్ధిపరచి ప్రపంచంతో అనుసంధానిస్తామన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో మూడు రోజుల పర్యటనలో భాగంగా చివరిరోజు సోమవారం.. నాగాలాండ్ రాజధాని కోహిమాలో నిర్వహిస్తున్న వార్షిక హార్న్‌బిల్ ఉత్సవాల ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బడ్జెట్‌లో ఈశాన్య ప్రాంత అభివృద్ధికి రూ. 53 వేల కోట్లు కేటాయించామన్నారు.

    పర్యాటకానికి అత్యంత అనువుగా ఉండే ఈ ప్రాంతంలో కొత్తగా 14 రైల్వే లైన్ల కోసం రూ. 28 వేల కోట్లు కేంద్రం అందిస్తుందని చెప్పారు. సమగ్ర టెలికమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాటులో భాగంగా 2జీ మొబైల్ సేవల కోసం రూ. 5 వేల కోట్లు మంజూరు చేసిందన్నారు. ఇక అభివృద్ధికి జీవనరేఖ అయిన విద్యుత్ వ్యవస్థ మెరుగుదల కోసం ఈశాన్య ప్రాంతంలోని నాగాలాండ్‌తో పాటు ఆరు రాష్ట్రాలకు మరో రూ. 5 వేల కోట్లు కేటాయించామన్నారు.

    మణిపూర్‌లో జాతీయ క్రీడా వర్సిటీని ఏర్పాటు చేయ సంకల్పించామని, దానితో ఈ ప్రాంతానికి ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. ఈ ప్రాంతంలో ఆరు కొత్త వ్యవసాయ కాలేజీలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. హార్న్‌బిల్ (ముక్కు పోడువుగా, కొమ్ములా ఉండే పక్షి) ఉత్సవాలతో నాగాలాండ్‌లో పర్యాటకం అభివృద్ధి చెందుతుందన్నారు. ఇంటర్నెట్, మొబైల్ ఫోన్లు వాడకుండా యువకులు ఉండకూడదని సూచించారు.
     
    పలతానా విద్యుత్ ప్రాజెక్టు జాతికి అంకితం

    ఓఎన్‌జీసీ, త్రిపుర పవర్ కంపెనీ (ఓటీపీసీ) సంయుక్తంగా త్రిపురలోని ఉదయ్‌పూర్‌లో నిర్మించిన పలతానా విద్యుత్ ప్రాజెక్టులో రెండో యూనిట్ ప్రారంభించిన మోదీ.. దానిని జాతికి అంకితం చేశారు.  త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
     
    అభివృద్ధి పథంలో ముందుకెళ్లాలి

    అంతకుముందు నాగాలాండ్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధాని ట్వీటర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. అలాగే బీఎస్‌ఎఫ్ 49వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆ దళ సేవల్ని ట్వీటర్‌లో ప్రధాని కొనియాడారు.
     
    కుడి ఎడమల మేలు కలయిక!

    అగర్తల: సైద్ధాంతికంగా తూర్పు, పడమర లాంటి నేతలిరువురు భేటీ అయిన అరుదైన సందర్భం సోమవారం త్రిపుర రాజధాని అగర్తలలో చోటు చేసుకుంది. త్రిపుర మార్క్సిస్ట్ మంత్రిమండలితో.. ప్రధాని మోదీ సమావేశమయ్యారు. త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ ఆహ్వానంపై రాష్ట్ర మంత్రిమండలితో సమావేశమైన మోదీ.. త్రిపురను మూడు దశాబ్దాల పాటు అతలాకుతలం చేసిన సాయుధ తిరుగుబాటును విజయవంతంగా అణిచేసిన రాష్ట్ర ప్రభుత్వ వ్యూహంపై ఆరా తీశారు.

    ఇందుకోసం వామపక్ష ప్రభుత్వం అనుసరించిన వ్యూహంపై సవివర నివేదికను రూపొందించాలని విజ్ఞప్తి చేశారు. డిసెంబర్ 7న జరిగే ప్రణాళికాసంఘం సమావేశంలో దానిని అందజేయాలని కోరారు.  మోదీతో భేటీ అనంతరం మాణిక్ సర్కార్ విలేకరులతో ఈ విషయాలు వెల్లడించారు.  భద్రతాబలగాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చామని.. అలాగే, రాష్ట్రంలోని గిరిజన, గిరిజనేతర ప్రజలందరి నుంచి తమకు మద్దతు లభించిందని..అదే తమ విజయ రహస్యమని మోదీతో చెప్పానన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement