
ఢిల్లీలో ఏపీ కాంగ్రెస్ నేతల అరెస్ట్
న్యూఢిల్లీ: తమ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ప్రకటించకుండా కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న నాన్చుడు వైఖరిని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు బుధవారం ఏపీ భవన్ వద్ద ఆందోళన చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు బయలు దేరిన నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు. వీరిని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ప్రత్యేకహోదాపై కేంద్రం స్పష్టమైన హామీ ఇవ్వాలన్న డిమాండ్ తో కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లారు. ప్రధాని మోదీని కలిసేందుకు అపాయింట్ మెంట్ కోరారు. ఈ మధ్యాహ్నం 12 గంటల వరకు వేచిచూశారు. అపాయింట్ మెంట్ రాకపోవడంతో ఏపీ భవన్ వద్ద నిరసనకు దిగారు. తర్వాత ప్రధాని మోదీని కలిసేందుకు బయలుదేరగా వీరిని పోలీసులు మార్గమధ్యలోనే అడ్డుకున్నారు.
కాగా, ప్రత్యేకహోదాకు మద్దతు ఇవ్వాలని పలు జాతీయ పార్టీల నాయకులను కాంగ్రెస్ నేతలు కలిశారు. ఏపీ ప్రత్యేకహోదాకు బిహార్ సీఎం నితీశ్ కుమార్, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ మద్దతు ప్రకటించారు. కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చేలా చొరవ చూపాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సోమవారం కాంగ్రెస్ నేతలు వినతిపత్రం సమర్పించారు.