ఐఐటీ ప్రిపరేషన్‌కు యాప్
13భాషల్లో అందుబాటులోకి: కేంద్రమంత్రి స్మృతిఇరానీ
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఐఐటీ-జేఈఈ ప్రవేశ పరీక్షకు సన్నద్ధమయ్యేందుకు వీలుగా ప్రత్యేక మొబైల్ యాప్, వెబ్‌పోర్టల్‌ను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ అందుబాటులోకి తేనుంది. ఐఐటీ ఫ్యాకల్టీల ఉపన్యాసాలు, గత యాభై ఏళ్ల ప్రవేశ పరీక్షల ప్రశ్న పత్రాలను ఇందులో ఉచితంగా పొందవచ్చని బుధవారం ఇక్కడ ‘ఎడ్యుకేషన్ ప్రైవేట్ సొసైటీ ఫర్ ఇండియా’ (ఈపీఎస్‌ఎఫ్‌ఐ) నిర్వహించిన సభలో ఆ శాఖ మంత్రి స్మృతిఇరానీ వెల్లడించారు. అన్ని ప్రాంతాల వారికీ ఉప యుక్తంగా ఉండేలా 13 భాషల్లో పాఠ్య సామగ్రిని అందుబాటులో ఉంచుతామన్నారు. వ్యాపారాత్మకంగా మారిన కోచింగ్ సెంటర్లను నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
‘ఐఐటీ ప్రవేశపరీక్ష సన్నాహకాల్లో విద్యార్థులకు ఎదురయ్యే అతి ముఖ్యమైన అంశం కోచింగ్. ఈ క్రమంలో వారికి చేయూతనందించేందుకు ప్రభుత్వం ఐఐటీ-పాల్ పోర్టల్, మొబైల్ యాప్ రూపొందించాలని నిర్ణయించింది. రెండు నెలల్లో ఇది అందుబాటులోకి వస్తుంది’ అని మంత్రి తెలిపారు. నకిలీ విశ్వవిద్యాలయాలతో విద్యా రంగానికి మచ్చ తెచ్చేవారికి అడ్డుకట్ట వేసేందుకు ఈపీఎస్‌ఎఫ్‌ఐ కృషిచేయాలన్నారు. నూతన విద్యా విధానంపై స్మృతి మాట్లాడుతూ... దీనిపై అధ్యయనం చేసేందుకు మాజీ కేబినెట్ కార్యదర్శి టీఎస్‌ఆర్ సుబ్రమణియన్ నేతృత్వంలో కమిటీ వేశామన్నారు. అలాగే మొబైల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని మారుమూల గ్రామాలకూ విస్తరించేలా ‘భారత్‌వాణి’ మొబైల్ యాప్ రూపొందిస్తున్నామని తెలిపారు. 22 భాషల్లో స్టడీ మెటీరియల్ ఇందులో లభిస్తుందన్నారు.