మోడీ సర్కారుకు కొత్త చిక్కు! | Army chief VK Singh virtually indicted by tribunal | Sakshi
Sakshi News home page

మోడీ సర్కారుకు కొత్త చిక్కు!

Published Sun, Sep 7 2014 1:08 AM | Last Updated on Fri, Oct 5 2018 6:32 PM

మోడీ సర్కారుకు కొత్త చిక్కు! - Sakshi

మోడీ సర్కారుకు కొత్త చిక్కు!

 కేంద్ర మంత్రి వీకే సింగ్‌ను తప్పుబట్టిన సైనిక ట్రిబ్యునల్
సుక్నా భూ కుంభకోణం కేసులో ఘాటు వ్యాఖ్యలు
ఆర్మీ చీఫ్‌గా సైన్యానికి ఆయన మచ్చ తెచ్చారన్న కోర్టు
సీనియర్ అధికారులను వేధించారు, కోర్టు మార్షల్‌నూ ప్రభావితం చేశారని మండిపాటు.. ఆర్మీ మాజీ అధికారి రథ్‌పై కోర్టు మార్షల్ రద్దు
న్యూఢిల్లీ: కేంద్రంలోని మోడీ సర్కారుకు ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. ఆయన కేబినెట్ సహచరుడు, ఆర్మీ మాజీ చీఫ్ జనరల్(రిటైర్డ్) వీకే సింగ్ గతంలో సుక్నా భూ కుంభకోణం కేసులో వ్యవహరించిన తీరును సైనిక కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం సైన్యానికి ఆయన మచ్చతెచ్చారని, సీనియర్ అధికారులపై ప్రతీకారం తీర్చుకునేందుకు వారిని వేధింపులకు గురి చేశారని, నిబంధనలను అతిక్రమించి మిలటరీ కోర్టును కూడా ప్రభావితం చేశారని సైనిక దళాల ట్రిబ్యునల్(ఏఎఫ్‌టీ) తాజాగా పేర్కొంది. సైన్యంలోని 33వ పటాళానికి చెందిన మాజీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ పీకే రథ్‌పై జరుగుతున్న కోర్టు మార్షల్(సైనిక కోర్టు విచారణ)ను రద్దు చేసింది. ఇంతకాలం వేధించినందుకు, ప్రతిష్ట దెబ్బతీసినందుకు ఆయనకు రూ.లక్ష చెల్లించాలని సైన్యాన్ని ఆదేశించింది.
 
అసలేం జరిగింది? పశ్చిమబెంగాల్‌లోని సుక్నా ప్రాంతంలో మిలిటరీ కంటోన్‌మెంట్‌కు ఆనుకుని ఉన్న 70 ఎకరాల్లో విద్యాసంస్థను నెలకొల్పేందుకు ఓ ప్రైవేటు బిల్డర్‌కు నిరభ్యంతర పత్రము(ఎన్‌వోసీ) ఇచ్చారు. దీనిపై అప్పట్లో ఈస్టర్న్ ఆర్మీ కమాండర్‌గా ఉన్న జనరల్ వీకే సింగ్ దీనిపై సైనిక విచారణ ప్రారంభించారు.  రథ్‌ను దోషిగా తేల్చుతూ ఇందుకు శిక్షగా ఆయన రెండేళ్ల సీనియారిటీని తగ్గిస్తూ 2011లో కోర్టు మార్షల్ నిర్ణయించింది. విద్యా సంస్థ ఏర్పాటు అవసరాన్ని సిఫారసు చేసిన అప్పటి ఆర్మీ సెక్రటరీ లెఫ్టినెంట్ జనరల్ అవదేశ్ ప్రకాశ్‌పైనా విచారణ కొనసాగించారు. అయితే దీనిపై జనరల్ రథ్ సైనిక ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు.

వీకే సింగ్ ఈ కేసుకు అనుచిత ప్రాధాన్యమిచ్చారని, ఆయన పుట్టిన సంవత్సరాన్ని 1951కి బదులు 1950గా అవదేశ్ ప్రకాశ్ తేల్చినందున ఆర్మీ చీఫ్‌గా సింగ్ పదవీ కాలం 8 నెలలకే పరిమితమైందని రథ్ తన పిటిషన్‌లో వివరించారు. దీంతో తమపై కక్ష పెంచుకుని ప్రతీకార చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ట్రిబ్యునల్... కోర్టు మార్షల్ నిర్ణయాన్ని తప్పుబట్టింది. సైన్యం పరిధిలో లేని భూమికి ఎన్‌వోసీ ఇవ్వడంలో ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించలేదని స్పష్టం చేసింది. కాగా దీనిపై జనరల్ రథ్ స్పందిస్తూ.. ఈ తీర్పుతో నా నిర్దోషిత్వం నిరూపితమైందన్నారు. ఇన్నేళ్లుగా తానెంతో వేదనను అనుభవించానన్నారు. సీనియర్ అధికారుల చేతిలో కింది సిబ్బంది బలికాకుండా, ఇలాంటివి పునరావృతం కాకుండా సైన్యం చర్యలు తీసుకోవాలని  సూచించారు.
 
ట్రిబ్యునల్ తీర్పుపై వీకే సింగ్ ధ్వజం

ట్రిబ్యునల్ తీర్పును కేంద్రం ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేయాలని వీకే సింగ్ కోరారు. సైనిక విచారణలో అంతా నిబంధనల ప్రకారమే జరిగిందన్నారు. ట్రిబ్యునల్ తనపై వ్యక్తిగత దాడికి దిగిందని, ఈ వ్యవహారంలో తాను అవినీతిని అడ్డుకోడానికి ప్రయత్నించినట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు.  77 పేజీల తీర్పు మొత్తంలో ఎక్కడా స్కాం గురించి ప్రస్తావించలేదని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement