కేంద్రమంత్రిపై ఆర్మీ చీఫ్ తీవ్ర ఆరోపణలు!
న్యూఢిల్లీ: తన పూర్వ ఆర్మీ చీఫ్, కేంద్రమంత్రి వీకే సింగ్‌పై ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. వీకే సింగ్ దురుద్దేశపూరితంగా వ్యవహరిస్తూ తన ప్రమోషన్‌ను అడ్డుకోవాలని, నిరంకుశంగా తనను శిక్షించాలనే ఆలోచనతోనే ఆయన ఇలా మిస్టిరియస్‌గా ప్రవర్తించారని దల్బీర్ సింగ్ ఆరోపించారు. ఈ మేరకు వ్యక్తిగత హోదాలో ఆయన బుధవారం సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. మాజీ ఆర్మీ చీఫ్ లేదా కేంద్రమంత్రిపై ఓ ఆర్మీ అధిపతి ఆరోపణలు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
2012లో అప్పటి ఆర్మీ చీఫ్‌గా ఉన్న వీకే సింగ్ తనను బాధితుడిని చేసేందుకు ప్రయత్నించారని, ఆర్మీ కమాండర్‌గా తనకు ప్రమోషన్ దక్కకూడదన్న ఏకైక ఉద్దేశంతో ఆయన ఇలా వ్యవహరించారని దల్బీర్ సింగ్ సుప్రీంకోర్టుకు తెలిపారు. నిరాధార, ఊహాజనిత, అసత్య ఆరోపణలతో మే 19, 2012న తనకు షోకాజ్ నోటీసు జారీచేశారని, ఆ తర్వాత అక్రమంగా తనపై క్రమశిక్షణ, విజిలెన్స్ (డీవీ) నిషేధాన్ని విధించారని ఆయన తెలిపారు. దల్బీర్ సింగ్‌ను ఆర్మీ కమాండర్‌గా నియమించడంలో ఆశ్రిత పక్షపాతానికి పాల్పడ్డారంటూ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) రవీ దస్తానె సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. ఆయనను ఆర్మీ కమాండర్‌గా నియమించడంతో జనరల్ బిక్రం సింగ్ తర్వాత ఆర్మీ చీఫ్‌గా నియమించడానికి మార్గం సుగమమైంది. 2012 ఏప్రిల్, మే నెలల్లో దల్బీర్ సింగ్‌పై వీకే సింగ్ డీవీ నిషేధాన్ని విధించినా.. ఆయనను ఆర్మీ చీఫ్ గా నియమించడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలవ్వగా.. ఈ కేసులో దల్బీర్ సింగ్ అఫిడవిట్ సమర్పించారు.