మాజీ సైనికాధిపతి జనరల్ వీకే సింగ్ మరో వివాదానికి తెరదీశారు. జమ్మూకాశ్మీర్‌లో కొనసాగేలా చూసేందుకు ఆ రాష్ట్రానికి చెందిన మంత్రులకు ఆర్మీ డబ్బులు ఇచ్చినట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు.
మరో వివాదానికి తెరలే పిన వీకే సింగ్
న్యూఢిల్లీ: మాజీ సైనికాధిపతి జనరల్ వీకే సింగ్ మరో వివాదానికి తెరదీశారు. జమ్మూకాశ్మీర్‌లో శాంతియుత పరిస్థితులు కొనసాగేలా చూసేందుకు ఆ రాష్ట్రానికి చెందిన మంత్రులకు ఆర్మీ డబ్బులు ఇచ్చినట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. సింగ్ చేసిన ఈ ప్రకటన మంగళవారం రాజకీయ వర్గాల్లో దుమారం రేపింది. డబ్బులు ఎవరికి ఇచ్చారో చెబితే ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర హోం మంత్రి షిండే పేర్కొనగా.. ఎవరికి డబ్బులు అందాయో బయటపెట్టాలంటూ జమ్మూకాశ్మీర్ అధికార పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా డిమాండ్ చేశారు.
ఈ ఆరోపణలపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలన్నారు. డబ్బులు తీసుకున్న మంత్రుల పేర్లు బయటపెట్టాలని, లేదంటే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని జమ్మూకాశ్మీర్ మంత్రులు, మాజీ మంత్రులు వీకే సింగ్‌ను హెచ్చరించారు. అటు కాంగ్రెస్ కూడా సింగ్ వ్యాఖ్యలపై మండిపడింది. సున్నితమైన అంశాలపై వీకే సింగ్ బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారంటూ దుయ్యబట్టింది.
తన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తడంతో వీకే సింగ్ నష్ట నివారణ చర్యలు చేపట్టారు. మంత్రులకు ఆర్మీ డబ్బులిచ్చింది లంచం రూపంలో కాదని, సదుద్దేశంతోనే ఇచ్చిందన్నారు. మంగళవారం ఆయన తన నివాసంలో విలేకరుల సమావేశంలో ఈ మేరకు వివరణ ఇచ్చారు.