ముంబై/చండీగఢ్: ముంబైలోని ఎల్ఫిన్‌స్టన్ రోడ్ రైల్వే స్టేషన్‌లో కొత్తగా నిర్మించబోయే పాదచారుల వంతెనకి సైన్యం సహాయం అందించనుంది. గత నెల ఈ వంతెనపై తొక్కిసలాట జరిగి 23 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీని స్థానంలో కొత్త వంతెన నిర్మించనున్నారు. ఇందుకు సైన్యం సాయం తీసుకుంటున్నట్లు మంగళవారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తెలిపారు.
ఎల్ఫిన్‌స్టన్ రైల్వేస్టేషన్‌ను రైల్వే మంత్రి పీయూష్ గోయల్, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం ఫడ్నవిస్ పరిశీలించారు. ఎల్ఫిన్‌స్టన్‌తో పాటు మరో రెండు రైల్వే స్టేషన్ల వద్ద పాదచారుల వంతెనల నిర్మాణాల కోసం సైన్యం సహకారానికి కేంద్రం సుముఖత వ్యక్తం చేసినట్లు ఫడ్నవిస్ చెప్పారు. రక్షణ మంత్రి సీతారామన్ మట్లాడుతూ ఎల్ఫిన్‌స్టన్ విషాదం చాలా పెద్దది కావడంతో రాష్ట్ర విజ్ఞప్తిని అంగీకరించినట్లు తెలిపారు. ఈ నిర్ణయాన్ని పంజాబ్ సీఎం అమరీందర్ తప్పుపట్టారు. సరిహద్దుల్లో కాపలా, యుద్ధాలు చేసేందుకు సైన్యానికి శిక్షణ ఇచ్చారని, వంతెనలు నిర్మించేందుకు కాదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment