మమత సెల్ఫ్ గోల్!
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ లో టోల్ గేట్ల వద్ద కేంద్ర బలగాల మొహరింపు వ్యవహారంలో సీఎం మమతా బెనర్జీదే తప్పని ఆర్మీ నిరూపించింది. తమకు సమాచారం ఇవ్వకుండా కేంద్ర బలగాలను తమ రాష్ట్రంలోకి పంపించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ మమత ఆందోళన చేశారు. దీంతో కేంద్ర బలగాలను పశ్చిమ బెంగాల్ నుంచి ఉపసంహరించారు. అయితే బెంగాల్ ప్రభుత్వ విభాగాల అభ్యర్థన మేరకే బలగాలను పంపించామని ఆర్మీ వెల్లడించింది.
బెంగాల్ లోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల నుంచి తమకు అందిన నాలుగు లేఖలను ఆర్మీ విడుదల చేసింది. బెంగాల్ జీఓసీకి చెందిన మేజర్ జనరల్ సునీల్ యాదవ్ ఈ లేఖలను విడుదల చేశారు. బెంగాల్ ప్రభుత్వ కార్యాలయాల నుంచి అవసరమైన అన్ని అనుమతులు తీసుకున్నాకే బలగాలను పంపించామని ఆయన వెల్లడించారు. బెంగాల్ కు కేంద్ర బలగాలు పంపించడానికి వారం ముందే (నవంబర్ 24న) అనుమతులు పొందామని చెప్పారు. ఆర్మీ వివరణతో మమత ఖంగుతిన్నారు. తమకు సమాచారం ఇవ్వకుండా కేంద్ర బలగాలు మొహరించారని హడావుడి చేసిన ఆమె సెల్ఫ్ గోల్ చేసుకున్నట్టైంది. ఇప్పుడెలా స్పందిస్తారో చూడాలి.