జైట్లీ అసమర్థుడు.. రాజీనామా చేయాలి: బీజేపీ ఎంపీ
కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీపై బీజేపీ నుంచి సస్పెండయిన నాయకుడు, ఎంపీ కీర్తి ఆజాద్ మండిపడ్డారు. ఆర్థికమంత్రి అసమర్థుడని, పెద్ద నోట్ల రద్దు వల్ల సామాన్య మానవులు ఎదుర్కొంటున్న సమస్యలకు బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి అరుణ్ జైట్లీ చెడ్డపేరు తెస్తున్నారని, పెద్దనోట్ల రద్దు తర్వాత ప్రజల కష్టాలన్నింటికీ ఆయనే బాధ్యుడని మాజీ క్రికెటర్ కూడా అయిన కీర్తి ఆజాద్ చెప్పారు. అసలు ఆయన ఆర్థికవేత్త కానే కాదని, ఆయన వెంటనే రాజీనామా చేయాలని విలేకరులతో మాట్లాడుతూ అన్నారు.
పెద్దనోట్లను రద్దు చేయాలని ప్రధానమంత్రి నిర్ణయం తీసుకున్న తర్వాత నల్ల ధనాన్ని తెల్లగా మార్చడంలోనే బ్యాంకులు నిమగ్నమై ఉన్నాయని ఆజాద్ మండిపడ్డారు. బ్యాంకులు ఎవరి పరిధిలోకి వస్తాయని.. ఇవన్నీ కూడా ఆర్థిక మంత్రిత్వశాఖ పరిధిలోకే వస్తాయి కాబట్టి అక్కడ జరుగుతున్న అక్రమాలకు బాధ్యతగా ఆర్థికమంత్రి తప్పుకోవాలని బిహార్‌లోని దర్భాంగా స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఎంపీ డిమాండ్ చేశారు.