సాక్షి, న్యూఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దేశ రాజధాని ప్రజలపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి వరాలు కురిపించారు. నీటి బిల్లుల బకాయిలను పూర్తిగా మాఫీ చేస్తున్నట్టు మంగళవారం ఆయన మీడియా సమావేశంలో ప్రకటించారు. ఢిల్లీ నీటి మండలి రికార్డులను ప్రక్షాళన చేస్తూ నీటి బిల్లుల బకాయిలను రద్దు చేసే పథకాన్ని తాము ప్రకటిస్తున్నామని పేర్కొన్నారు. నీటి బకాయిల్లో వినియోగదారులు చెల్లించాల్సిన బిల్లు బకాయిలతో పాటు బిల్లింగ్‌లో దొర్లిన పొరపాట్లు కూడా ఉన్నాయని సీఎం వెల్లడించారు. ఢిల్లీలో అన్ని వర్గాల ప్రజలు ముందుకొచ్చి నీటి మీటర్లను బిగించుకుని ప్రధాన స్రవంతిలో కలవాలని, నవంబర్ 30లోగా మీటర్లు బిగించుకున్నవారికే తాము ఈ పథకాన్ని వర్తింపచేస్తామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. కాగా 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగానికి ఎలాంటి బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదని ఇటీవల కేజ్రీవాల్ ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment