న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్‌ను నియంత్రించే చర్యల్లో భాగంగా రోగులకు అందిస్తున్న ప్లాస్మా చికిత్స సానుకూల ఫలితాలనిస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. లోక్ నాయక్ జై ప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రిలో కరోనా పేషెంట్లపై ఈ మేరకు నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైనట్లు పేర్కొన్నారు. ప్లాస్మా చికిత్స అనంతరం ఇద్దరు పేషెంట్లు కోలుకున్నారని.. వారిని త్వరలోనే డిశ్చార్జ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ప్లాస్మా థెరపీని మరింత విస్తృతం చేసేందుకు కేంద్రం నుంచి అనుమతి కోరనున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా.. ఇప్పుడే ఈ థెరపీపై పూర్తి అవగాహనకు రాలేమని... కేవలం ప్లాస్మా చికిత్సతో రోగులు కోలుకున్న దాఖలాలు లేవని అభిప్రాయపడ్డారు. అయితే కరోనాపై పోరులో ప్రస్తుతానికి ఇదొక్కటే మన ముందున్న మార్గమని పేర్కొన్నారు. (కరోనా: ‘ప్లాస్మా థెరపీ’తో చెక్!)
ఇక కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేయడానికి ముందుకు వస్తేనే ఈ థెరపీని ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఉంటుందని కేజ్రీవాల్ అన్నారు. ప్లాస్మా దానం చేయడాన్ని నిజమైన దేశభక్తికి నిదర్శనంగా పేర్కొన్నారు. మరోవైపు.. ఈ విషయం గురించి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బైలరీ సైన్స్ డైరెక్టర్ ఎస్‌కే సరీన్ మాట్లాడుతూ... ‘‘ ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రిలోని మరో ముగ్గురు కరోనా పేషెంట్లకు ఎక్కించేందుకు రక్తం, ప్లాస్మా సిద్ధంగా ఉంది. ఈరోజే వారికి ప్లాస్మా థెరపీ ప్రారంభిస్తాం. ఈ చికిత్స సానుకూల ఫలితాలను ఇవ్వడం సంతోషంగా ఉంది’’అని హర్షం వ్యక్తం చేశారు. ఇక ఢిల్లీలో ఇప్పటి వరకు 2376 కరోనా కేసులు నమోదు కాగా.. 50 మరణాలు సంభవించాయి.
కాగా కోవిడ్ నుంచి కోలుకున్న రోగుల నుంచి ప్లాస్మా యాంటీ బాడీలను తీసుకొని వాటిని కోవిడ్ రోగికి ఎక్కించడం ద్వారా ఎక్కువ శాతం ఫలితం వస్తోందని, మరణాల రేటు చాలా తక్కువగా ఉందని నిపుణులు చెబుతున్న విషయం తెలిసిందే. విదేశాల్లో ఈ ప్రక్రియ ద్వారా వైద్యులు సానుకూల ఫలితాలు పొందుతున్నారు. ఈ నేపథ్యంలో కన్వాల్సెంట్ ప్లాస్మా చికిత్సపై పరిశోధనలు జరిపేందుకు ముందుకొచ్చే సంస్థలు దరఖాస్తు చేసుకోవాలంటూ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment