వీళ్లకు ఏడాదిలోపే గర్వం వచ్చేసింది
కాంగ్రెస్ పార్టీ వరుసగా అధికారంలోకి రావడంతో వాళ్లకు ఆరేడేళ్ల తర్వాత గర్వం వచ్చిందని, కానీ ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలకు ఏడాదిలోపే గర్వం వచ్చేసిందని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. బిహార్ ఫలితాలతో ప్రజలు ఆ గర్వాన్ని బద్దలు కొట్టారన్నారు. ఈ ఫలితాల పుణ్యమాని కేంద్రంలో వాళ్ల మంత్రులకు పనిచేసే స్వతంత్రం వస్తుందని, బీజేపీలో కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలకు గౌరవం లభిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఢిల్లీ ప్రభుత్వ పాలనలో వేలు పెడుతున్న తీరు ఇకపై ఆగుతుందని భావిస్తున్నామని చెప్పారు. వాళ్లు పదే పదే.. ప్రతిరోజూ తమ పనిలో వేలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల్లో కూడా కేంద్రం జోక్యం తగ్గుతుందని ఆశిస్తున్నామన్నారు.
అసహన వాతావరణం ఇప్పటికైనా ఆగుతుందని, జాతుల మధ్య, ప్రజల మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయని కేజ్రీవాల్ చెప్పారు. బిహార్ ఫలితాలు ఒక రకంగా ప్రధాని నరేంద్రమోదీ పనితీరు మీద రిఫరెండం లాంటివని అన్నారు. ఆయనెలా పనిచేస్తున్నారో, అమిత్ షా - మోదీ జోడీ ఎలా ఉందో యావత్ దేశానికి తెలిసిపోయిందని విమర్శించారు.