
ఢిల్లీ అల్లర్లను ఊచకోతగా అభివర్ణించిన ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ
హైదరాబాద్ : ఢిల్లీలో ఇటీవల జరిగిన అల్లర్లను ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ మారణహోమంగా అభివర్ణించారు. ఢిల్లీ అల్లర్లపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వీడాలని, బాధిత ప్రజలను పరామర్శించేందుకు ఆయా ప్రాంతాల్లో పర్యటించాలని కోరారు. దేశ రాజధానిని కదిపివేసిన అల్లర్లపై ఎన్డీయే నేతలు మౌనం దాల్చడాన్ని ఆయన ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీ తన అధికార నివాసానికి సమీపంలో జరిగిన ఢిల్లీ హింసాకాండపై ఎందుకు నోరు మెదపడం లేదని తాను అడగదల్చుకున్నానని అన్నారు.
ఈ అల్లర్లలో 40 మందికి పైగా మరణించారని, ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడాలని డిమాండ్ చేశారు. హింసాకాండతో దద్దరిల్లిన శివ్ విహార్‌ను సందర్శించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో మరణించిన వారంతా భారతీయులేనని అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో ఓవైసీ మాట్లాడుతూ బీజేపీ నేతల ప్రసంగాల్లో చేసిన ప్రకటనలతోనే హింస ప్రజ‍్వరిల్లిందని చెప్పుకొచ్చారు. గుజరాత్‌లో 2002లో జరిగిన మారణ హోమంతో ప్రధాని గుణపాఠం నేర్చుకుంటారని తాను అనుకున్నానని అయితే 2020లో ఢిల్లీలో ఇది చోటుచేసుకుందని ఆందోళన వ్యక్తం చేశారు.