విద్యార్థినిలపై ఖాకీల దాష్టీకం
జైపూర్: విద్యా బుద్ధులు చెప్పడానికి ఉపాధ్యాయులు కావాలని అడిగిన పాపానికి పదవ తరగతి విద్యార్థినిలపై ఖాకీలు దాష్టీకాన్ని ప్రదర్శించారు. వీధి రౌడీల్లా బాలికల పట్ల అమర్యాదగా ప్రవర్తించారు. రాజస్థాన్ లోని మారు మూల గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే 14 , 16 ఏళ్ల బాలికలపై స్థానిక పోలీసులు ఈ దురాగతానికి పాల్పడ్డారు.
టాంక్ జిల్లా చురు గ్రామంలోని సెంకండరీ స్కూల్లో 10వ తరగతి చదువుకునే సుమారు 300 మంది విద్యార్థులకు గాను కేవలం ఏడుగురే ఉపాధ్యాయులు ఉన్నారు. దీంతో రానున్న పబ్లిక్ పరీక్షల్ని ఎలా ఎదుర్కోవాలనే ఆవేదనతో విద్యార్థినిలు ఆందోళనకు దిగారు. టీచర్లను నియమించాలంటూ స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. సెప్టెంబర్ 29న దాదాపు వందమంది విద్యార్థినులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు.
పోలీసులు విచక్షణారహితంగా ఆందోళన చేస్తున్న బాలికలపై విరుచుకుపడ్డారు. నోటికొచ్చిన బూతులు తిడుతూ బూటు కాళ్లతో తొక్కారు. లాఠీచార్జి చేసి విద్యార్థినిలను లాగి పడేశారు. అంతటితో ఖాకీల ప్రకోపం చల్లారలేదు. సారా ప్యాకెట్లను అమ్మాయిల మీదకు విసిరి వికృతంగా ప్రవర్తించారు. అనంతరం కొంతమంది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపై కేసులు నమోదు చేశారు. విద్యార్థినులు రెచ్చగొట్టారనే అరోపణలతో కేసులు పెట్టారు.
ఖాకీ క్రౌర్యంపై మీడియా ముందు విద్యార్థినులు బావురుమన్నారు. తమను ఘోరంగా అవమానించారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. బూటు కాళ్లతో తొక్కడం మూలంగా ఇప్పటికీ నడవలేకపోతున్నానని మరో విద్యార్థిని వాపోయింది. విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే తమకు టీచర్లు కావాలని అడిగామన్నారు. ఉపాధ్యాయులు లేకపోతే పదవతరగతి పరీక్షలు ఎలా రాయాలంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ఉదంతంపై మానవ హక్కుల సంఘాలు, ప్రజాసంఘాలు స్పందించాయి. విద్యార్థినుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపై అక్రమ కేసులు బనాయించడంపై మండిపడ్డారు. కేసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాసంఘ నేత కవిత శ్రీవాస్తవ సంబంధిత పోలీస్ ఆఫీసర్ను తక్షణమే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మరోవైపు విద్యార్థినిలపై లాఠీచార్జి ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయిస్తామని జిల్లా కలెక్టర్ రేఖా గుప్త ప్రకటించారు.