న్యూఢిల్లీ : పౌరసత్వ బిల్లు పట్ల అస్సాంకు చెందిన ప్రముఖ గాయకుడు జుబీన్ గర్గ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బిల్లును తిరస్కరించాలంటూ అస్సాం ముఖ్యమంత్రి సోనొవాల్‌ను కోరారు. అలా చేయలేకపోతే 2016లో తన పాటలను వాడుకుని గెల్చిన ఓట్లను తిరిగిచ్చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాలన్నింటిని జుబీన్ తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ‘డియర్ సర్బానంద సోనొవాల్.. కొన్ని రోజుల క్రితం పౌరసత్వ బిల్లును ఉద్దేశిస్తూ మీకు లేఖ రాశాను. కానీ మీరు నల్లజెండాలను లెక్కపెట్టుకోవడంలో బిజీ అయిపోయినట్లున్నారు. 2016లో నా పాటలతో గెలిచిన ఓట్లన్నీ తిరిగిచ్చేస్తారా? కావాలంటే మీరు నాకు ఇచ్చిన పారితోషికాన్ని వెనక్కి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను’ అని పేర్కొన్నారు. జుబీన్ పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాల్లో వైరల్ అవుతోంది.
పౌరసత్వ బిల్లును తిరస్కరించకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని జనవరి 8న జుబీన్, సీఎం సోనొవాల్‌ను హెచ్చరిస్తూ లేఖ రాశారు. ఈ విషయం గురించి జుబీన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇటీవల పౌరసత్వ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కనీసం అప్పుడైనా సోనొవాల్ దానిని తిరస్కరించవచ్చు కదా? కానీ అలా చేయలేదు. ముందు మీరు బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడి చూడండి. ఆ తర్వాత జరిగేది జరుగుతుంది. ఇప్పటికీ నేను కోపాన్ని అణచివేసుకుంటున్నాను. నేను మరో వారం రోజులు అస్సాంలో ఉండటంలేదు. ఈలోపు సోనొవాల్ పౌరసత్వ బిల్లుపై నిర్ణయం తీసుకుంటే ఆయనకే మంచిది. లేదంటే నేనే రంగంలోకి దిగుతాను. నేనేం చేస్తానో నాకే తెలీదు’ అంటూ హెచ్చరించారు జుబిన్.
Comments
Please login to add a commentAdd a comment