
అప్పుడు ఆయన వయస్సు 50 ఏళ్లు. తెల్లటి జుట్టు, చేతి కర్రతో ...
‘తండ్రీ, కొడుకులు ఒకే కాలేజీలో చదవడం మీరెప్పుడైనా చూశారా... అది కూడా ఒకే తరగతిలో.. మీరు ఈ విషయం తెలుసుకోలేదంటే కాన్పూర్ దయానంద్ ఆంగ్లో- వేదిక్ కాలేజీ గురించి పూర్తిగా తెలుసుకోనట్లే’ అంటూ అటల్ బిహారీ వాజ్‌పేయి రాసిన ఆర్టికల్‌ను ఉటంకిస్తూ ఆ కాలేజీ ప్రిన్సిపల్ అమిత్ కుమార్ శ్రీవాస్తవ అటల్ జీతో తమ కాలేజీకి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వాజ్‌పేయి అంచెలంచెలుగా ఎదుగుతూ... భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ తన మూలాలు ఎప్పుడూ మర్చిపోలేదు అనేందుకు అటల్ జీ రాసిన ఈ వ్యాసం చిన్న ఉదాహరణ అంటూ నివాళులు అర్పించారు.
అటల్ జీ వ్యాసంలోని అంశాలు సంక్షిప్తంగా...
‘1945లో గ్వాలియర్‌లోని విక్టోరియా కాలేజీలో బీఏ పూర్తి చేశాను. ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేసిన మా నాన్న గారు అప్పుడే రిటైర్ అయ్యారు. సరిగ్గా అదే సమయంలో నా సోదరీమణుల పెళ్లి గురించి చర్చలు జరుగుతున్నాయి. పెళ్లి తంతు పూర్తవ్వాలంటే కట్నకానుకలు ఇవ్వాలి. ఈ పరిస్థితుల్లో నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయగలనా అనే సందేహం, భవిష్యత్తుపై బెంగ... అపుడే గ్వాలియర్ మహారాజా శ్రీమంత్ జీవాజీ రావు సింధియా గారి చొరవతో... నాకు 75 రూపాయల ఉపకార వేతనం లభించింది. దాంతో ఈ సమస్యల నుంచి నాకు ఉపశమనం లభించింది. నేను సంతోషంగా నా చదువు పూర్తి చేసేందుకు సిద్ధమయ్యాను. అయితే అప్పుడు మా నాన్న గారు తీసుకున్న నిర్ణయం నన్నెంతగానో ఆశ్చర్యపరిచింది. 30 ఏళ్ల పాటు ఉపాధ్యాయునిగా సేవలందించిన ఆయన ఉన్నత విద్యనభ్యసించాలని నిర్ణయించుకున్నారు. నాతో పాటే కాన్పూరు వచ్చి లా చదవాలని భావించారు.
అప్పుడు ఆయన వయస్సు 50 ఏళ్లు. తెల్లటి జుట్టు, చేతి కర్రతో మా నాన్న అదే.. పండిట్ కృష్ణ బిహారీలాల్ వాజ్‌పేయి... ప్రిన్సిపాల్ ఆఫీసుకు వచ్చారు. ఆ సమయంలో ప్రిన్సిపాల్‌గా ఉన్న భట్నాగర్ మా నాన్నగారు ప్రొఫెసర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునేందుకు వచ్చారేమో అనుకున్నారు. కానీ నేను కూడా మీ కాలేజీలో విద్యార్థిగా చేరేందుకు వచ్చానని నాన్న చెప్పినప్పుడు.. ఆయన ఒక్కసారిగా కుర్చీలో నుంచి లేచి, నిలబడి మీరు చాలా గొప్ప పని చేయబోతున్నారంటూ నాన్న గారిని అభినందించారు.
ఇక అప్పుడు మొదలైంది కాలేజీ విద్యార్థుల్లో ఆసక్తి. తండ్రీ కొడుకులు ఇద్దరు ఒకే కాలేజీ, ఒకే తరగతి, ఒకే సెక్షన్ అట. వారు హాస్టల్‌లో ఉన్నారట అంటూ మమ్మల్ని చూసేందుకు గుంపులు గుంపులుగా విద్యార్థులు మా గదికి వచ్చారు. నాన్న గారు, నేను ఒకే సెక్షన్ అయ్యేసరికి లెక్చరర్ల నుంచి మా ఇద్దరికీ ఒకే రకమైన ప్రశ్నలు ఎదురయ్యేవి. తరగతి గదికి నేను ఆలస్యంగా వచ్చిన రోజు నాన్న గారిని, నాన్న గారు ఆలస్యంగా వచ్చిన రోజు నన్ను.. ఆలస్యానికి కారణమేంటో అంటూ ప్రశ్నించేవారు. దీంతో నాన్నా, నేను ఓ నిర్ణయానికి వచ్చేశాం. సెక్షన్లు మారిపోవాలని. వెంటనే ప్రిన్సిపాల్‌కు చెప్పి చెరో సెక్షన్‌కు మారిపోయాం. ఆ సమంయలో పొలిటికల్ సైన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. అలా రెండేళ్లు గడిచిపోయాయి’ అంటూ కర్మయోగి తన తండ్రితో కాలేజీలో గడిపిన క్షణాల గురించి 2002లో రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. అయితే స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత వివిధ కారణాల వల్ల వాజ్‌పేయి మధ్యలోనే లా చదువును ఆపేశారు. ఆ సమయంలో కాలేజీని, స్నేహితులను వదిలివెళ్లడం తననెంతో బాధించిందని వ్యాసంలో రాసుకొచ్చారు.