
ఛోటూకు కారుణ్య మరణం
ఇండోర్: ఛోటూ గత మూడేళ్లుగా అచేతనంగా పడి ఉంది. తనకు సోకిన పక్షవాతం వల్ల కనీసం అటూ ఇటూ కదలడానికి కూడా వీలు లేకుండా పోయింది. దీంతో అధికారులు 35 ఏళ్ల ఛోటూ పడుతున్న ఇబ్బందిని చూడలేక దానికి శనివారం కారుణ్య మరణాన్ని ప్రసాదిస్తున్నారు. దానిని ఎంతో అల్లారుముద్దుగా ఛోటూను సాకిన జీవన్ దాదా బాధ మాటల్లో వర్ణించలేనిది.
ఇండోర్ జూలోని హిమాలయన్ రకానికి చెందిన ఎలుగుబంటి ఛోటూకు కారుణ్య మరణాన్ని అమలు చేయాలని సెంట్రల్ జూ అథారిటీ నిర్ణయించింది. జూలో పుట్టినప్పటి నుంచి ఛోటూను సంరక్షించిన జీవన్ దాదా శుక్రవారం దానికి చివరిసారిగా అహారం అందించాడు. ఛోటూ కోలుకోవడానికి అత్యుత్తమ వైద్యులతో చికిత్స అందించినా అవేమీ ఫలితాలను ఇవ్వలేదని జూ ఇంచార్జ్ డాక్టర్ ఉత్తమ్ యాదవ్ తెలిపారు.
గత సంవత్సరం ఛోటూకు కారుణ్య మరణాన్ని ప్రసాదించాలనే ప్రతిపాదనకు జీవన్ దాదా నిరాకరించాడు. పూర్తిగా వృద్ధాప్యంలోకి ప్రవేశించిన ఆ ఎలుగుబంటి ఇక కోలుకోవడం కష్టమని తెలిపిన వైద్యులు.. కష్టం మీద ఇటీవల జీవన్ దాదాను ఒప్పించారు. ఎలుగుబంటికి నొప్పి కలిగించని విధానం ద్వారా జూ అధికారులు, ఎన్జీవోల సమక్షంలో వైద్యులు దానికి కారుణ్య మరణాన్ని అమలు చేస్తున్నారు.