
ఇండోర్: మధ్యప్రదేశ్, ఇండోర్‌లో చోటుచేసుకున్న విషాద ఘటన వెనుక అసలు రహస్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పరీక్షల్లో తప్పుతానేమోననే భయంతో ఉసురు తీసుకుందనుకున్న తమ బిడ్డ అత్యధిక మార్కులు సాధించడంతో విస్తుపోయిన కుటుంబ సభ్యులు అసలు విషయాన్నిఆరా తీశారు. పొరుగున ఉండే ఇద్దరు వ్యక్తుల వేధింపుల కారణంగానే ఆమె బలవన్మరణానికి పాల్పడిందని తెలిసి బావురుమన్నారు.
ఇండోర్‌కు చెందిన ఒక యువతి (19) రెండు రోజుల క్రితం (సోమవారం ఉదయం) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే పరీక్షల్లో ఫెయిల్ అవుతానేమోనన్నభయంతోనే ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటుందని కుటుంబ సభ్యులు భావించారు. కానీ ఆ తరువాత ప్రకటించిన (సోమవారం మధ్యాహ్నం)12 వ తరగతి పరీక్షా ఫలితాల్లో 74 శాతం మార్కులు సాధించింది. దీంతో అనుమానం వచ్చిన బాధిత యువతి సోదరుడు చుట్టుపక్కల విచారించగా అసలు సంగతి బైటపడింది.
తన సోదరిని పొరుగున ఉండే ఇద్దరు యువకులు వేధింపులకు గురి చేయడంతోనే చనిపోయిందని యువతి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి చేసుకోవాలంటూ ఆమెను చాలాకాలంగా వేధిస్తున్నారని తెలిపారు. అంతేకాదు దీనికి ఒప్పుకోకపోతే కుటుంబాన్ని చంపేస్తామని బెదరించారని ఆరోపించారు. చివరికి తన సోదరి చనిపోయే ముందు రోజుకూడా ఇంట్లో ఎవరూ లేని సమయంలో సంబంధిత వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి, పెళ్లికి ఒప్పుకోకపోతే భయంకర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ హెచ్చరించడంతోనే ఆమె ప్రాణాలు తీసుకుందని వాపోయారు. నిందితులకు నేర చరిత్ర కూడా ఉందని పోలీసులకు వివరించారు. మరోవైపు బాలిక సోదరుడి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామనీ, ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసు అధికారి యోగేశ్ తోమర్ బుధవారం వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment