జస్టిస్ రామ్మోహన్‌రెడ్డిని ‘కృష్ణా’ నుంచి తప్పించండి
♦ కృష్ణా జలాల వివాదంలో కర్ణాటక మెలిక
♦ కేంద్ర జల వనరుల శాఖకు ఆ రాష్ట్ర సీఎస్ లేఖ
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా నదీ జలాల వివాదం మరో మలుపు తిరిగింది. కర్ణాటక ప్రభుత్వం ముందు జాగ్రత్త పేరుతో తాజాగా ఇంకో మెలికపెట్టింది. కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలోని రాష్ట్రానికి చెందిన న్యాయమూర్తిని ఆ నదీ జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్‌లో సభ్యుడిగా నియమించడం సబబు కాద ని, దీని వల్ల భవిష్యత్తులో కొత్త వివాదం తలెత్తవచ్చని కర్ణాటక ప్రభుత్వం జనవరి 14న కేంద్ర జల వనరుల శాఖకు ఒక లేఖ రాసింది.
కర్ణాటకకు చెందిన జస్టిస్ రామ్మోహన్‌రెడ్డి కృష్ణా ట్రిబ్యునల్‌లో ఉంటే భవిష్యత్తులో ఇతర భాగస్వామ్య రాష్ట్రాలకు అనుమానాలు, అపోహలు తలెత్తే ప్రమాదం ఉన్నందున ఆయనను తప్పించాలని కోరింది. ఇదే అంశాన్ని మధ్యంతర దరఖాస్తు రూపంలో మంగళవారం ట్రిబ్యునల్ విచారణ సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది అనిల్ దివాన్ నివేదించారు. కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి శశిశేఖర్‌కు కర్ణాటక సీఎస్ అరవింద్ జాదవ్ రాసిన లేఖలోని అంశాలను ఆయన వివరించారు.
ప్రజాప్రయోజనాల దృష్ట్యానే: కర్ణాటక
అనిల్ దివాన్ తన వాదన వినిపిస్తూ ‘ట్రిబ్యునల్ విచారణ కొనసాగాక రేపు ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేయొచ్చు. కేవలం ప్రజాప్రయోజనాల దృష్ట్యానే ఈ అంశాన్ని లేవనెత్తాం’ అని పేర్కొన్నారు.
మాకేమీ అభ్యంతరం లేదు: మహారాష్ట్ర
ఈ విషయంలో మహారాష్ట్రకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆ రాష్ట్రం తరఫు సీనియర్ న్యాయవాది అంద్యార్జున చెప్పారు. ఇప్పటికే నదీ జలాల వివాద పరిష్కారం ఆలస్యమవుతోందని, అవార్డు నోటిఫై చేయలేదని ఆయన బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ దృష్టికి తీసుకువచ్చారు.
పరిశీలించాల్సిన అవసరం ఉందనిపిస్తోంది: ఏపీ
ఏపీ తరపున సీనియర్ న్యాయవాది ఏకే గంగూలీ తన వాదనలు వినిపిస్తూ.. ప్రత్యేక అవసరాల దృష్ట్యా ఏర్పాటైన ప్రత్యేక ట్రిబ్యునళ్ల విషయంలో ఎలాంటి అపోహలు ఉండాల్సిన అవసరం లేదని, కానీ కర్ణాటక ఈ అంశాన్ని లేవనెత్తాక దీనిని పరిశీలించాల్సిన అవసరం ఉందనిపిస్తోందన్నారు. తమ ప్రభుత్వ వైఖరి తెలుసుకుని నివేదిస్తామని చెప్పారు. తాము కూడా తమ ప్రభుత్వ వైఖరిని తెలుసుకుని నివేదిస్తామని తెలంగాణ అదనపు అడ్వొకేట్ జనరల్ రామచంద్రారావు చెప్పారు.
ఇది ఫోరం కాదు: కేంద్రం
కేంద్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ఖాద్రీ తన వాదనలు వినిపిస్తూ.. ‘నియామకం జరిపినప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకు వచ్చింది? అయినా, ఒకవేళ వారికి అభ్యంతరం ఉంటే, నియామకాన్ని సవాలు చేసేందుకు తగిన ఫోరం ఈ ట్రిబ్యునల్ కాదు. ట్రిబ్యునల్ సభ్యుడిని భారత ప్రధాన న్యాయమూర్తి నియమిస్తారు. మేం కేవలం నోటిఫికేషన్ ఇస్తాం..’ అని అన్నారు. కేంద్రం వైఖరిని తెలుసుకుని నివేదించేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. దీంతో జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ తదుపరి విచారణను బుధవారానికి వాయిదావేశారు.