సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్య ఓ ఆధ్యాత్మిక నగరం. అయితే అది ఒక్క హిందువులకే కాదు బౌద్ధులు, జైనులు, సిక్కులు, ముస్లింలు, పలు రకాల ఫకీర్లకు కూడా. ఒక్క క్రైస్తవులకు మినహా అన్ని మతాల వారికి ఈ ఆధ్యాత్మిక నగరంలో ప్రార్థనా మందిరాలు ఉన్నాయి. ఏ మతం వారు వారి వారి ప్రార్థనా మందిరాలకు వెళతారు. దర్గాలకు మాత్రం ముస్లింలతోపాటు హిందువులూ వెళతారు. నగరంలో రెండు ప్రముఖ సిక్కుల గురుద్వారాలు, పలు జైన మందిరాలు, అనేక హిందూ దేవాలయాలు ఉన్నాయి. అవద్ నవాబులకు అధికారిక చిహ్నమైన మత్స్యానికి కూడా మందిరాలు ఉన్నాయి. నౌగాజియా పీర్‌తోపాటు చిన్న చిన్న దర్గాలు ఉన్నాయి. ఆర్చా రాజు నిర్మించిన 19వ శతాబ్దం నాటి రామాలయంతోపాటు హనుమాన్ గఢీ కూడా ఉంది. రామాలయం కన్నా హనుమాన్ గఢీకే భక్తుల తాకిడి ఎక్కువ. అప్పుడప్పుడు వీచే సుడి గాలులు తప్పా ఎప్పుడూ ప్రశాంత వాతావరణం కనిపించే అయోధ్యలో 26 ఏళ్ల క్రితం అలజడి రేగింది.
1992, డిసెంబర్ 6వ తేదీన బీజేపీ నాయకుల ప్రసంగాల మధ్య హిందూ కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చేశారు. పర్యవసానంగా దేశవ్యాప్తంగా జరిగిన అల్లర్లలో రెండువేలకు మందికిపైగా అమాయకులు మరణించిన విషయం తెల్సిందే. అప్పటివరకు దేశ, విదేశీ పర్యాటకులతో కిటకిటలాడిన అయోధ్య నగరంలో కొన్నేళ్లపాటు శ్మశాన నిశబ్దం నెలకొంది. పౌరజీవనం స్తంభించిపోయింది. చిన్నా, చితక వ్యాపారులు పొట్ట పట్టుకొని పరాయి ప్రాంతానికి తరలిపోయారు. ప్రస్తుతం అయోధ్యలో ఉన్న మొత్తం జనాభా 55 వేలు.
‘రామ మందిరం అంశం నా వ్యాపారాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. అది రాజకీయ నాయకులకు లాభం చేకూర్చింది తప్ప, నాతోపాటు అయోధ్య వాసులెవరికీ ఎలాంటి లాభం చేకూర్చలేక పోయింది. ఆ రోజున బాబ్రీ మసీదు కూల్చివేతకు కుట్ర పన్నిన వాడిలో నేను ఒకడినే కాకుండా జనాన్ని రెచ్చగొట్టిన వారిలో కూడా నేను ఉన్నాను’ అని అయోధ్యలో 1980 దశకం నుంచి నగల వ్యాపారం చేస్తున్న మాజీ శివసేన కార్యకర్త బగేలు ప్రసాద్ సోని తెలిపారు. తన వ్యాపారం దెబ్బతినగానే తాను శివసేనకు రాజీనామా చేశానని ఆయన చెప్పారు. చాలాకాలం తర్వాత అయోధ్యకు పర్యాటకులు రావడం ప్రారంభమైందని, అయితే 1992కు ముందున్నంతగా లేదని అయోధ్యలో అతిపెద్ద వ్యాపారవేత్తయిన అంజనీ గార్గ్ తెలిపారు. అతి పెద్ద రామాలయం వచ్చాక మళ్లీ వ్యాపారం పుంజుకుంటుందని తనతోపాటు స్థానిక వ్యాపారులు ఆశించారని ఆయన చెప్పారు. ఇప్పటికైనా మందిరాన్ని కోరుకుంటున్నారా? అని ప్రశ్నించగా ఇరువర్గాల సమ్మతితో శాంతియుతంగా నిర్మిస్తే అభ్యంతరం లేదని అన్నారు. బీజేపీ నాలుగున్నర ఏళ్లపాటు అధికారంలో ఉన్నా రామాలయాన్ని నిర్మించలేకపోయిందని, రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మళ్లీ మందిరం మాటెత్తుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం అయోధ్యలో ముస్లింలు, హిందువులు కలిసికట్టుగా జీవిస్తున్నారని, మళ్లీ మందిరం అంశాన్ని లేవనెత్తి వారి మధ్య చిచ్చు పెట్టరాదని ప్రియాంక యాదవ్ అనే స్కూలు టీచరు వ్యాఖ్యానించారు.
మధ్య తరగతి, శ్రామిక, కార్మిక వర్గాలు ఘర్షణలు జరుగుతాయన్న భయంతో రామాలయాన్ని కోరుకోవడం లేదు. వారిలో చాలా మంది ఈ విషయమై మీడియాతో మాట్లాడేందుకు కూడా నిరాకరించారు. వ్యాపారం మరింత పుంజుకుంటుందన్న ఆశతో వ్యాపారులు అతి పెద్ద రామ మందిరాన్ని నిర్మించాలని కోరుకుంటున్నారు. అది కూడా శాంతియుతంగా జరగాలని అంటున్నారు. బాబ్రీ కూల్చివేత వార్షిక దినం సందర్భంగా అయోధ్య నగరమంతటా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ప్రజలు కూడా పెద్దగా వీధుల్లో తిరగడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment