తెగ నవ్విస్తున్న రాందేవ్ ఫొటో
న్యూఢిల్లీ: రాందేవ్ బాబా అనగానే టక్కున ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది యోగా. ఆయన దేశీయంగానే కాక విదేశాల్లో సైతం భారతీయ యోగా విద్యకు ఎనలేని ప్రాముఖ్యం తెచ్చారు. అంతేకాకుండా పతంజలి పేరిట పలు ఉత్పత్తులను మార్కెట్లో ప్రవేశ పెట్టి పరోక్షంగా పెద్ద బిజినెస్ మేన్ గా కూడా అవతరించారు. అయితే, ఆయన వివాదాల్లో కూరుకుపోయిన సందర్భాలు లేకపోలేదు. అలాగే ఆయనపై చాలాసార్లు సెటైర్లు వేసిన సందర్భాలు కూడా తక్కువేం కాదు.
ఏదైమైనా యోగా విద్యకు ఆయన తెచ్చిన ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని ఇండియా టుడే రాందేవ్ ఫొటోను కవర్ పేజీ ఫొటోగా వేసింది. ఇందులో ఆయన ప్రసారిత పడోట్టానాసన అనే ఆసనాన్ని వేసిన చిత్రాన్ని ముద్రించారు. ఇందులో ఆయన తన శరీరంమొత్తాన్ని నడుం నుంచి కిందికి ముందుకు వంచి కాళ్ల సందులో నుంచి తలతో చూసినట్లుగా ఉంది. ఆ స్టిల్లే ఇప్పుడు ఆన్ లైన్ లో వైరల్ అయి పెద్ద హల్ చల్ చేస్తోంది.
ఆ ఫొటోను తీసుకొని పలువురు నెటిజన్లు ట్విటర్ లో కౌంటర్లు వేయడం మొదలుపెట్టారు. జెట్ విమానాలతో యుద్ధానికి దూసుకెళుతున్నట్లు, రాకెట్ లాగా ఆకాశంలోకి రయ్మని ఎగురుతున్నట్లు, గోల్ కీపర్ గా ప్రాక్టీస్ చేస్తున్నట్లు, స్విమ్మింగ్ కోసం భంగిమ పెట్టినట్లు, ప్యారాచూట్ ప్రాక్టిస్ చేస్తున్నట్లు రకరకాల కామెంట్లు పెట్టారు. అంతేకాదు, తమ ఫొటో షాప్ కు పదును పెట్టి అచ్చం అలాంటి చిత్రాలు కూడా పోస్ట్ చేశారు.