మోదీజీ.. మార్పించరూ
రద్దయిన పాతనోట్లు ఇప్పటికీ కోట్ల కొద్ది పట్టుబడుతున్నాయి. అయితే అదంతా బ్లాక్‌మనీ... బడాబాబుల డబ్బు. కానీ ఈ బంగ్లాదేశీ వనితది దీనగాథ. వేధింపులు భరించలేక పెళ్లయిన మూడేళ్లకే భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఓ దుస్తుల తయారీ పరిశ్రమలో నెలకు రూ. 9 వేల జీతానికి పనిచేసేది. భారత్‌లో తనకు తెలిసిన వారున్నారని, అక్కడైతే నెలకు రూ.15,000 వరకు సంపాదించొచ్చని.. కలిసి పనిచేసే వ్యక్తి ఆమెకు ఆశ చూపాడు. ఆర్థిక పరిస్థితుల కారణంగా అందుకు అంగీకరించిన ఆమె అతని వెంట వచ్చేసింది.
ముంబై శివార్లలోని వాషికి తీసుకొచ్చి ఓ నేపాలీ మహిళకు రూ.50 వేలకు ఆమెను అమ్మేశాడా ప్రబుద్ధుడు. బెంగళూరుకు తరలించి బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దించారు. స్వదేశానికి పంపుతామని చెప్పి తర్వాత పుణేకు తరలించారు. అక్కడి బుధవార్‌పేట్‌లోని ఓ వ్యభిచార గృహం నుంచి 2015 డిసెంబర్‌లో పోలీసులు ఆమెను రక్షించారు. బంగ్లాదేశ్ నుంచి అనుమతి రావడానికి ఇన్నాళ్లూ వేచిచూసింది. ఆమె తమ పౌరురాలేనని ధ్రువీకరించుకున్న బంగ్లాదేశ్ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.
అయితే తన దగ్గర రూ.10 వేల పాతనోట్లు ఉన్నాయని, వీటిని మార్చుకోవడానికి సహకరించాలని కోరుతూ చేతిరాతతో రాసిన లేఖ ఫొటోను ఆమె ప్రధానమంత్రి మోదీకి, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌కు ట్వీట్ చేసింది. విటులు టిప్‌గా ఇచ్చిన డబ్బును కూడబెట్టుకున్నానని, నోట్ల రద్దు సమయంలో ఆ డబ్బు వ్యభిచార గృహ నిర్వాహకుల వద్ద ఉండిపోయిందని వివరించింది. ఈ అభాగ్యురాలి వేదన నెటిజన్లు పలువురిని కదిలించింది.