
బ్యాంకులకు వరుస సెలవులు.. జనాలు ఎటుపోతారో?
ఆ బ్యాంకు వరుసల్లోనే కూలిపోతున్నవారు కొందరైతే.. అనారోగ్యంతో ఆస్పత్రి పాలవుతున్నవారు ఇంకొందరు. చిరాకుతో పరస్పరం నాకంటే నాకంటూ నాదంటే నాదంటూ ముష్టిఘాతాలకు దిగుతున్నవారు కూడా వీరిలో మినాహాయింపుకాదు. ఇది చాలదన్నట్లూ పోలీసుల లాఠీ దెబ్బలు అదనపు బహుమానం. దీంతో త్యాగాలు ప్రజలవి.. బోగాలు నాయకులవి అన్నచందాన పరిస్థితి మరోసారి కనిపిస్తోంది. ఇంత జరుగుతున్నా ప్రజలు మావైపే ఉన్నారంటూ ప్రధాని, ఇతర నాయకులు ఏకపక్షంగా అభిప్రాయాలు ప్రకటించడం కూడా బ్యాంకులముందు పడిగాపులుగాస్తున్న వారిని విస్మయ పరుస్తోంది.
బ్యాంకుల ముందు నిల్చున్న సెక్యూరిటీలతోటి బ్యాంకు ఉద్యోగులు, మేనేజర్లతోటి జనాలు ఓ చిన్నపాటి యుద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుందంటే ఆశ్చర్యం కాదు. కనీసం ఆర్బీఐ విధించిన షరతుల ప్రకారమైనా ప్రజలకు బ్యాంకులు డబ్బు చెల్లిస్తున్నాయా అది కూడా లేదు. దీంతో చాలిచాలని డబ్బుతో కొన్ని అవసరాలు తీరి.. ఇంకొన్ని తీరక తీవ్ర పరిస్థితులతోనే జనాలు అల్లాడిపోతుంటే ఇప్పుడు గుదిబండలాగా.. బ్యాంకులకు వరుసగా మూడు రోజుల సెలవులొచ్చాయి.
రెండో శనివారం, ఆదివారం, సోమవారం ముస్లింల పర్వదినం మిలాద్-ఉన్-నబి సందర్భంగా బ్యాంకులకు సెలవులు రావడంతో ఈ 72గంటలు ఎలా గడుస్తాయా అని ఆలోచనలో పడ్డారు. కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని వారి పరిస్థితి మరింత దయనీయంగా ఈ మూడురోజులు మారనుంది. పెద్ద నోట్లను రద్దు చేసిన నవంబర్ 8 తెల్లవారి నుంచి ఇప్పటి వరకు బ్యాంకుల ముందు ప్రజల అవస్థలు ఏమాత్రం మారని పరిస్థితి. రోజురోజుకు బ్యాంకుల ముందు క్యూలు పెరుగుతున్నాయే తప్ప తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. పోనీ ఏటీఎంలలో డబ్బు నింపుతున్నారా అంటే అది శూన్యం. బ్యాంకులు నడిచే రోజుల్లో మాత్రమే కొన్ని చోట్లల్లోనే చాలిచాలనంత డబ్బు పెడుతున్నారు. అది కూడా అలాపెట్టి పెట్టగానే అయిపోతోంది.
సాఫ్ట్ వేర్ సమస్య అంటూ, డబ్బు అందడం లేదంటూ బ్యాంకులు వివరణ ఇస్తూ వస్తున్నాయి. ఈ తీరు ఇప్పటికే ప్రజానీకానికి తీవ్ర చిరాకులు తెప్పిస్తోంది. కొన్ని చోట్ల ఆందోళనలు కూడా మొదలవుతున్నాయి. జనాలు రోడ్లెక్కి బ్యాంకులకు, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. కొన్ని చోట్ల బ్యాంకులపై దాడులు చేస్తున్నారు. ఇప్పుడు మూడు రోజుల సెలవులు రావడం, అది కూడా వీకెండ్‌కావడంతో మరోసారి జనాల పరిస్థితి అధ్వాన్నంగా కనిపించనుంది. సెలవులను దృష్టిలో పెట్టుకునైనా అందుబాటులో ఉన్న ఏటీఎంలలో డబ్బులు నింపేస్తే పూర్తి స్థాయిలో కాకున్నా కొంతమేరకైనా తమకు ఉపశమనం కలిగించినట్లవుతుందని ప్రజలు వాపోతున్నారు.