బీస్ట్.. ‘ఫేస్‌బుక్’ హీరో..
రాజ వైభోగం అంటే ఈ శునకానిదే! ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్‌బర్గ్ అల్లారుముద్దుగా పెంచుకునే ఈ బొచ్చుకుక్కకు అభిమానుల సంఖ్య లక్షల సంఖ్యలోనే. కచ్చితంగా చెప్పాలంటే హంగేరియన్ జాతికి చెందిన ఈ బుజ్జి ‘బీస్ట్’కు 19,13,857 మంది ఫేస్‌బుక్‌లో ‘లైక్స్’ కొట్టారు. ఇది ఒక్కోసారి ఒక్కో అవతారంలో కనిపిస్తుంది. ఒకసారి పొట్టి గొర్రె పిల్లలా మరోసారి పిల్లలు ఆడుకునే టెడ్డీ బేర్‌లా అన్నమాట.
ఇది పరుగు పెట్టిందంటే రేసుగుర్రం దీని ముందు బలాదూరే. అన్నట్లు మేతకు వెళ్లిన గొర్రెల మందకు కూడా ఇది కాపలా కాస్తుంది. ఇక జుకెర్‌బర్గ్ మాట జవదాటదు. ‘డాడీ’ ఆజ్ఞ ఇచ్చేదాకా కళ్ల ముందు మాంసం ముక్కలు ఊరిస్తున్నా కట్టుదాటదు. అప్పుడప్పుడు ఫేస్‌బుక్ ఉద్యోగులతో కలసి కంప్యూటర్ ముందు తన ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తుంది. ఓసారి ఏమైందో తెలుసా...? దీని అల్లరి చేష్టలు భరించలేక జుకెర్‌బర్గ్ ఓ బాత్‌రూమ్‌లో బంధించాడు. మరి బీస్ట్ ఊరుకుందా? నోటికి అందినవల్లా కొరికి పారేసి తమ జాతి సత్తా చూపించింది.