మళ్ళీ 'బీఫ్ బిర్యానీ' గొడవ
అలీగఢ్: దేశంలో మరోసారి బీఫ్ వంటకాల వివాదం వెలుగుచూసింది. అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ) క్యాంటీన్‌లో బీఫ్ బిర్యానీ వడ్డించారంటూ సోషల్ మీడియాలో ఫొటోలు కలకలం సృష్టించాయి. ఈ విద్యాసంస్థ తన స్వభావాన్ని బయటపెట్టేందుకు మరోసారి వివాదానికి తెర తీసిందంటూ ఆరోపణలు గుప్పుమన్నాయి.
శుక్రవారం ఏఎంయూ మెడికల్ కాలేజీ క్యాంటీన్‌లో బీఫ్ బిర్యానీ వడ్డించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. వాట్సాప్ లో పోస్ట్ చేసిన ఫొటోలు తాజా వివాదానికి కారణమయ్యాయి. క్యాంటీన్‌లో వండినది ఆవు మాంసమే అయినా, గేదె మాంసంగా ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతోపాటు క్యాంటీన్ మెనూ కార్డులోని ఓ ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా వ్యాపించింది. అయితే బీఫ్ బిర్యానీ వడ్డన ఆరోపణను యూనివర్సిటీ ఖండించింది. తమ క్యాంటీన్‌లో అటువంటిదేమీ జరగలేదని తెలిపింది.