బినామీ లావాదేవీలకు ఏడేళ్ల జైలు
న్యూఢిల్లీ: దేశంలో బినామీ లావాదేవీలు జరిపితే ఏడేళ్ల వరకు కఠిన జైలు శిక్షతో పాటు భారీ జరిమానా ఉంటుందని ఆదాయ పన్ను (ఐటీ) శాఖ హెచ్చరించింది. వీరు బినామీ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్ చట్టం – 1988తో పాటు ఐటీ చట్టం ప్రకారం కూడా శిక్షార్హులని పేర్కొంది. ఎవరూ బీనామీ లావాదేవీలు జరపడానికి వీల్లేదని, ఇది 2016 నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిందని పేర్కొంది.
ఈ చట్టం ప్రకారం బినామీగా వ్యవహరించిన వ్యక్తి, వాస్తవ ఆస్తిపరుడు, సహాయం చేసినవారు అందరూ శిక్షార్హులేనని, వారికి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష, బినామీ ఆస్తి మార్కెట్ ధరలో 25 శాతం జరిమానా విధించాల్సి ఉంటుందని ఐటీ శాఖ తెలిపింది. ఒకవేళ అధికారులకు బినామీ ఆస్తులకు సంబంధించి తప్పుడు సమాచారం ఇస్తే ఐదేళ్ల వరకు జైలు శిక్ష, ఆస్తి మార్కెట్ ధరలో 10 శాతం జరిమానా కట్టాల్సి ఉంటుందని పేర్కొంది. అలాగే సంబంధిత బినామీ ఆస్తిని గుర్తిస్తే ప్రభుత్వం దాన్ని జప్తు చేస్తుందని వెల్లడించింది. ఈ చట్టం గతేడాది అమల్లోకి వచ్చినప్పుటి నుంచి దేశవ్యాప్తంగా 230 కేసులు నమోదు కాగా, రూ. 55 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్ అయ్యాయి.