కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో అత్యధికంగా ఒక్కరోజే రికార్డు స్థాయిలో 895 కొత్త కరోనా కేసులు నమోదుకాగా 21 మంది మరణించారు. వీటిలో అత్యధికంగా కోల్‌కతాలోనే 244 కొత్త కేసులు వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తుంది. గత 24 గంటల్లోనే కరోనా కారణంగా 21 మంది మరణించారని వైద్యా ఆరోగ్యశాఖ సోమవారం వెల్లడించింది. అయితే గత ఐదు రోజుల నుంచి రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కేవలం ఐదు రోజుల్లోనే 3567 కొత్త కరోనా కేసులు నమోదైతే వాటిలో కోల్‌కతాలోనే 1,187 కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర రాజధానిలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతుండటంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఇతర జిల్లాలనుంచి కరోనా రోగులను కోల్‌కతాలోని ఆసుపత్రులకు తరలిస్తున్నందునే కేసుల సంఖ్య అధికంగా ఉందని ఇటీవల మీడియా సమావేశంలో వెల్లడించారు. (10 వేల పడకల కోవిడ్ సెంటర్ )
అత్యధిక కరోనా కేసుల నేపథ్యంలో ఆసుపత్రుల్లో బెడ్లు సరిపోవడం లేదని వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 8,018 బెడ్లు ఖాళీగా ఉన్నాయని ఎవరూ ఆందోళనకు గురికావద్దని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే కరోనా రోగులు అత్యధికంగా ప్రైవేటు ఆసుపత్రులకే మొగ్గు చూపుతున్నారని కరోనా బాధితుల తాకిడి పెరిగిందని ప్రైవేట్ ఆసుపత్రులు నివేదించాయి. ప్రస్తుతం కేవలం 107 పడకలు మాత్రమే ఖాళీగా ఉన్నాయని వెల్లడించాయి. ప్రభుత్వం చర్యలు తీసుకొని కరోనా ఆస్పత్రుల సంఖ్యను పెంచాలని విఙ్ఞప్తి చేశాయి. (కరోనా: ప్రపంచంలో మూడో స్థానంలో భారత్ )
Comments
Please login to add a commentAdd a comment