కొచ్చి: కరోనా వైరస్, లాక్ డౌన్ సమయంలో కేరళలో దాదాపు రెండు నెలల తరువాత మద్యం అమ్మకాలకు అనుమతి లభించడంతో మందుబాబులు తమ దూకుడును ప్రదర్శిస్తున్నారు. కేరళ బేవరేజెస్ కార్పొరేషన్ తీసుకొచ్చిన బేవ్‌క్యూ (వర్చువల్ క్యూ లైన్) యాప్ కు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. గూగుల్ ప్లే స్టోర్‌లో విడుదలైన కొద్ది గంటలకే మూడు లక్షలకు పైగా డౌన్‌లోడ్‌లను సాధించింది. 2.82 లక్షల టోకెన్లు జారీ అయ్యాయి.
కోవిడ్-19 సమయంలో మద్యం దుకాణాల్లో రద్దీ, భౌతికదూరం, దుకాణాల ముందు క్యూలైన్లను కట్టడి చేసే దిశగా ఆన్‌లైన్‌లో టోకెన్ ఆధారిత అమ్మకాలకు కేరళ ఈ యాప్ తీసుకొచ్చింది. కొచ్చికి చెందిన ఫెయిర్‌కోడ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే స్టార్టప్ దీన్ని అభివృద్ధి చేసింది. ప్రస్తుతం ఇది ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులో వుంది. ఐవోఎస్ వినియోగదారులకు అందుబాటులో ఉన్నదీ లేనిదీ స్పష్టత లేదు. (మద్యం కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్)
మరోవైపు ఈ యాప్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడం విమర్శలకు తావిచ్చింది. క్యూ ఆర్ కోడ్ స్కానింగ్ లో సమస్యల కారణంగా మద్యం దుకాణదారులు లాగ్ బుక్ లో టోకెన్ నంబర్లను చేసుకొని మరీ మద్యం సరఫరా చేశారట. చాలామంది వినియోగదారులు ఈ యాప్ సరిగా పనిచేయడం లేదంటూ ట్వీట్ చేస్తున్నారు. పదేపదే ప్రయత్నించినప్పటికీ ఓటీపీ రావడం లేదని ఒకరు, టైమ్ స్లాట్‌ను ఎంచుకొనే ఆప్షన్ కనిపించడం లేదని మరొకరు ఫిర్యాదు చేశారు. అయితే విషయం తెలిసిన అప్లికేషన్ ప్రొవైడర్లు ప్రస్తుతానికి టోకెన్ ఇవ్వడం నిలిపివేసి, శుక్రవారం మధ్యాహ్నం నుంచి తిరిగి జారీ చేయనున్నట్లు ప్రకటించారు.
కాగా కేరళలో మద్యం విక్రయాలకు గురువారం నుంచి అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. ఈ యాప్ ద్వారా కేటాయించిన టోకెన్ నెంబర్ ద్వారానే మద్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే ప్రతీ నాలుగు రోజులుకు ఒకసారి మాత్రమే ఒక వ్యక్తి మద్యాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. బేవ్‌క్యూ యాప్ లో రిజిస్టర్ కాని వారు రాష్ట్రంలో మద్యాన్ని కొనలేరు.
Comments
Please login to add a commentAdd a comment