ఏపీ బీజేపీ వ్యవహరాల ఇంచార్జీగా రవి శంకర్ ప్రసాద్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ వ్యవహరాల పర్యవేక్షకుడిగా రవి శంకర్ ప్రసాద్ను నియమించినట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. శనివారం న్యూఢిల్లీలో బీజేపీ పార్టీ సీనియర్ నాయకుల సమావేశానంతరం రాజ్నాథ్ సింగ్ విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి ఇంకా తేదీ నిర్ణయించలేదని అన్నారు. ఈ నెల 20న బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతుందని తెలిపారు. ఆ రోజున ప్రధాని పేరును లాంఛనంగా ప్రకటిస్తామని వెల్లడించారు.
స్వాతంత్ర్యం అనంతరం దేశంలో కాంగ్రెసేతర పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించిన పార్టీ బీజేపీ అని ఆయన గుర్తు చేశారు. భారత ప్రజలు ఇచ్చిన తీర్పు పట్ల తామ సమావేశంలో నాయకులు హర్షం వ్యక్తం చేసినట్లు చెప్పారు. దేశ ప్రజలను ఓ తాటిపై నడిపి బీజేపీ విజయానికి విశేష కృషి చేసిన నరేంద్ర మోడీకి ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ కృతజ్ఞతలు తెలిపారు. మోడీ ప్రధాని పదవి చేపట్టనున్న తరుణంలో గుజరాత్ ముఖ్యమంత్రి ఎంపిక బాధ్యతను పార్టీ తన భుజస్కంధాలపై ఉంచిందన్నారు.