సాక్షి : బనారస్ హిందూ యూనివర్సిటీలో ఎంఏ ప్రథమ సెమిస్టర్ పరీక్ష రాసిన విద్యార్థులు పొలిటికల్ సైన్స్ ప్రశ్నాపత్రం చూసి బుర్ర గోక్కున్నారు. జీఎస్టీ, గ్లోబలైజేషన్ మీద అడిగిన ప్రశ్నలే అందుకు కారణం. వాటికి చరిత్రకు ముడిపెట్టి ఓ ఫ్రొఫెసర్ గారు చేసిన ప్రయోగం విద్యార్థుల మతిపోవటానికి కారణమైంది.
పుస్తకాల్లో లేని ప్రశ్నలు కనిపించటంతో ఒక్కసారిగా వాళ్లు అవాకయ్యారు. ఏం రాయాలో తెలీక బయటకు వచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే పేపర్ తయారు చేసిన ప్రొఫెసర్ కౌశల్ కిషోర్ మిశ్రా మాత్రం తాను చేసిన పనిని సమర్థించుకుంటున్నారు. అర్థశాస్త్రం రచించిన కౌటిల్యుడు(చాణక్యుడు) జీఎస్టీ గురించి, ప్రపంచీకరణ గురించి మను చెప్పటం అన్నది నిజం. ఆయా పుసక్తాల్లో వాటి గురించి పరోక్ష వ్యాఖ్యానాలు కూడా ఉన్నాయి అని కౌశల్ చెబుతున్నారు.
మిశ్రా ఆరెస్సెస్ కార్యకర్త కావటంతో తన సొంత ఆలోచనలను రంగరించి బోధనలో తరచూ ప్రయోగాలు నిర్వహిస్తుంటారని.. ఈ మేరకు ఆయన సొంత మెటీరియల్‌ను కూడా తమకు అందించారని పలువురు విద్యార్థులు చెబుతున్నారు. ఈ అంశంపై పలువురు ఫ్రొఫెసర్లు మండిపడ్డారు. తలా తోక లేని ఇలాంటి ప్రయోగాలు చేయటం సరికాదని వారు హితవు పలికారు. కాగా, యూనివర్సిటీ అధికారులు మాత్రం ఈ అంశంతో తమకేం సంబంధం లేదని.. నిపుణుల పర్యవేక్షణలోనే ఆ ప్రశ్నాపత్రం తయారయ్యిందని చెప్పటం కొసమెరుపు. గత ఏప్రిల్‌లో గుజరాత్ లో ఓ పరీక్ష సందర్భంగా ప్రభుత్వ పథకాలపై ప్రశ్నలు రావటంతో విద్యార్థులు ఇలాగే అవాక్కయ్యారు. ఆ ఘటన అప్పట్లో రాజకీయంగా కూడా విమర్శలకు తావునిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment