BHU professor
-
కీచక ప్రొఫెసర్‌పై వర్సిటీ చర్యలు
లక్నో : విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్ తిరిగి క్లాస్‌లకు హాజరవడంతో బెనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ) విద్యార్ధులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడంతో వర్సిటీ అధికారులు దిగివచ్చారు. విద్యార్ధినుల పట్ల అసభ్యంగా వ్యవహరించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్‌ను దీర్ఘకాలం సెలవుపై వెళ్లాలని వర్సిటీ ఆదేశించింది. జువాలజీ ప్రొఫెసర్ శైల్ కుమార్ చౌబే గత ఏడాది అక్టోబర్‌లో స్టడీ టూర్‌పై ఒడిషాకు వెళ్లిన సందర్భంలో విద్యార్థినులపై వల్గర్ కామెంట్స్ చేయడంతో పాటు వారి పట్ల అమర్యాదకరంగా వ్యవహరించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎస్కే చౌబేపై వచ్చిన ఆరోపణలను వర్సిటీ అత్యున్నత నిర్ణాయక సంఘం విచారిస్తుందని, తుది నిర్ణయం వెలువడే వరకూ ఆయనను లాంగ్ లీవ్‌పై పంపినట్టు బీహెచ్‌యూ అధికారులు వెల్లడించారు. ప్రొఫెసర్‌పై ఫిర్యాదులను కంప్లైంట్స్ కమిటీ పర్యవేక్షిస్తుందని, నివేదిక ఆధారంగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆయనపై చర్యలు తీసుకుంటుందని బీహెచ్‌యూ ఓ ప్రకటనలో పేర్కొంది. గతంలో ప్రొఫెసర్ చౌబేను సస్పెండ్ చేసిన అధికారులు ఈ ఏడాది జూన్‌లో విచారణ చేపట్టారు. అంతర్గత విచారణ అనంతరం యూనివర్సిటీ అధికారులు ప్రొఫెసర్‌ను తీవ్రంగా మందలించి సస్పెన్షన్‌ను ఎత్తివేశారు. ప్రొఫెసర్ తిరిగి క్లాసులకు హాజరవడంతో విద్యార్ధులు ఆందోళనలు చేపట్టడంతో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తన నిర్ణయాన్ని తిరిగి సమీక్షించాలని నిర్ణయించింది. మరోవైపు విద్యార్ధినుల పట్ల అభ్యంతరకరంగా వ్యవహరించిన ప్రొఫెసర్ రాజీనామా చేయాలని ఆయనపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని విద్యార్ధులు డిమాండ్ చేస్తున్నారు. -
చాణక్యుడు-జీఎస్టీ... అసలేంటి సంబంధం?
సాక్షి : బనారస్ హిందూ యూనివర్సిటీలో ఎంఏ ప్రథమ సెమిస్టర్ పరీక్ష రాసిన విద్యార్థులు పొలిటికల్ సైన్స్ ప్రశ్నాపత్రం చూసి బుర్ర గోక్కున్నారు. జీఎస్టీ, గ్లోబలైజేషన్ మీద అడిగిన ప్రశ్నలే అందుకు కారణం. వాటికి చరిత్రకు ముడిపెట్టి ఓ ఫ్రొఫెసర్ గారు చేసిన ప్రయోగం విద్యార్థుల మతిపోవటానికి కారణమైంది. పుస్తకాల్లో లేని ప్రశ్నలు కనిపించటంతో ఒక్కసారిగా వాళ్లు అవాకయ్యారు. ఏం రాయాలో తెలీక బయటకు వచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే పేపర్ తయారు చేసిన ప్రొఫెసర్ కౌశల్ కిషోర్ మిశ్రా మాత్రం తాను చేసిన పనిని సమర్థించుకుంటున్నారు. అర్థశాస్త్రం రచించిన కౌటిల్యుడు(చాణక్యుడు) జీఎస్టీ గురించి, ప్రపంచీకరణ గురించి మను చెప్పటం అన్నది నిజం. ఆయా పుసక్తాల్లో వాటి గురించి పరోక్ష వ్యాఖ్యానాలు కూడా ఉన్నాయి అని కౌశల్ చెబుతున్నారు. మిశ్రా ఆరెస్సెస్ కార్యకర్త కావటంతో తన సొంత ఆలోచనలను రంగరించి బోధనలో తరచూ ప్రయోగాలు నిర్వహిస్తుంటారని.. ఈ మేరకు ఆయన సొంత మెటీరియల్‌ను కూడా తమకు అందించారని పలువురు విద్యార్థులు చెబుతున్నారు. ఈ అంశంపై పలువురు ఫ్రొఫెసర్లు మండిపడ్డారు. తలా తోక లేని ఇలాంటి ప్రయోగాలు చేయటం సరికాదని వారు హితవు పలికారు. కాగా, యూనివర్సిటీ అధికారులు మాత్రం ఈ అంశంతో తమకేం సంబంధం లేదని.. నిపుణుల పర్యవేక్షణలోనే ఆ ప్రశ్నాపత్రం తయారయ్యిందని చెప్పటం కొసమెరుపు. గత ఏప్రిల్‌లో గుజరాత్ లో ఓ పరీక్ష సందర్భంగా ప్రభుత్వ పథకాలపై ప్రశ్నలు రావటంతో విద్యార్థులు ఇలాగే అవాక్కయ్యారు. ఆ ఘటన అప్పట్లో రాజకీయంగా కూడా విమర్శలకు తావునిచ్చింది. -
అశ్లీలతకు బ్రేక్.. హర హర మహాదేవ!
వారణాసి : బనారస్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ ఒకాయన కనిపెట్టిన యాప్ అశ్లీల సైట్లకు బ్రేకులు వేస్తుందంట. ఆ యాప్ ఉన్న ఫోన్లలో పోర్న్ సైట్లు ఓపెన్ చేస్తే చాలూ వాటిని బ్లాక్ చేయటమే కాదు.. వెంటనే భక్తి పాటలు మారుమోగుతాయి కూడా. సంస్కారి యాప్‌గా ఇప్పుడు ఇది ప్రాచుర్యం పొందుతోంది. బనారస్ హిందూ యూనివర్సిటీ న్యూరాలజీ ప్రొఫెసర్ డాక్టర్ విజయనాథ్ 'హర హర మహదేవ' పేరిట దీనిని రూపొందించారు. అశ్లీల కంటెంట్ లేదా తీవ్ర హింస ఉన్న వీడియోలు, ఫోటోలు ఓపెన్ చేస్తే చాలూ ఇది పని చేస్తుందన్న మాట. ముఖ్యంగా తమ తల్లిదండ్రుల నిఘాకు దొరక్కుండా తప్పించుకుని తిరిగే పిల్లల కోసం దీనిని డెవలప్ చేసినట్లు ఆయన చెబుతున్నారు. ఈ యాప్‌కు ఉన్న మరో స్పెషాలిటీ ఏంటంటే.. ఇది ఇన్స్టాల్ చేశాక హైడ్లోకి వెళ్లిపోతుంది. తద్వారా దానిని ఇన్స్టాల్ చేశారన్న విషయం కూడా ముందు వారు గుర్తించలేకపోతారన్నమాట. దీనిని harharmahadev.co వెబ్సైట్ నుంచి ఈ వెబ్ అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చని విజయనాథ్ తెలిపారు. ప్రస్తుతం ఈ యాప్ హిందూ భక్తిపాటలను మాత్రమే ప్లే చేస్తోందని, త్వరలో ఇతర మతాల గీతాలను కూడా పొందుపరిచి యాప్‌ను అభివృద్ధి చేస్తామని ఆయన వెల్లడించాడు. అయితే ల్యాప్ ట్యాప్‌లు, డెస్క్ టాప్ వర్షన్లకు అందుబాటులో ఉన్న ఈ యాప్ అండ్రాయిడ్ ఫోన్లకు పూర్తిస్థాయిలో రావటానికి కాస్త సమయం పడుతుందని వెబ్ డెవలపర్ అంకిత్ శ్రీవాస్తవ చెబుతున్నారు. -
టెకీతో ఫోన్లో మాట్లాడి... వధువు ఆత్మహత్య
వారణాసి: మరికొన్నిరోజుల్లో ఆమె పెళ్లి పీటలు ఎక్కాల్సింది ...అయితే ఇంతలోనే ఆత్మహత్య చేసుకుంది. సాఫ్ట్ వేర్ ఇంజినీరు వరుడు తనను తిరస్కరించాడని యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. స్వస్తి పాండే(31) వారణాసిలోని బెనారస్ హిందూ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తుండేది. ఈ క్రమంలో ఓ ఇంజినీర్ తో ఆమె పెళ్లి నిశ్చయమైంది. కొన్నిరోజుల్లో వివాహం అనగా వరుడు తనకు ఈ పెళ్లి ఇష్టంలేదని వధువుకు తేల్చి చెప్పేశాడు. దీంతో ఆమె మనస్తాపానికి గురైంది. బంధువుల ఇంట్లో పెళ్లి ఉండటంతో స్వస్తి తండ్రి అశోక్ పాండే, సోదరి మాత్రమే ఇంట్లో ఉండిపోగా మిగతాసభ్యులు జార్ఖండ్ కు వెళ్లారు. తండ్రి, సోదరి లేని సమయంలో స్వస్తి పాండే ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలను సూసైడ్ నోట్ లో పేర్కొంది. తన పెళ్లి ఆగిపోతుందన్న విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పలేక బాధను తనలో దిగమింగుకోలేక ఆదివారం సాయంత్రం బలవన్మరణానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు. చనిపోయే కొన్ని నిమిషాలకు ముందు కాబోయే భర్తతో ఆమె చాలా సమయం ఫోన్ లో సంభాషించిందని, పెళ్లి తనకు ఇష్టంలేదని ఇంజినీర్ చెప్పడంతో తాను ఆత్మహత్యకు పాల్పడుతున్న విషయాన్ని వరుడికి కచ్చితంగా చెప్పి ఉంటుందని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. స్వస్తి సూసైడ్ నోట్ ఆధారంగా విచారణ ప్రారంభించామని పోలీసులు వివరించారు.