టెకీతో ఫోన్లో మాట్లాడి... వధువు ఆత్మహత్య
వారణాసి: మరికొన్నిరోజుల్లో ఆమె పెళ్లి పీటలు ఎక్కాల్సింది ...అయితే ఇంతలోనే ఆత్మహత్య చేసుకుంది. సాఫ్ట్ వేర్ ఇంజినీరు వరుడు తనను తిరస్కరించాడని యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. స్వస్తి పాండే(31) వారణాసిలోని బెనారస్ హిందూ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తుండేది. ఈ క్రమంలో ఓ ఇంజినీర్ తో ఆమె పెళ్లి నిశ్చయమైంది. కొన్నిరోజుల్లో వివాహం అనగా వరుడు తనకు ఈ పెళ్లి ఇష్టంలేదని వధువుకు తేల్చి చెప్పేశాడు. దీంతో ఆమె మనస్తాపానికి గురైంది.
బంధువుల ఇంట్లో పెళ్లి ఉండటంతో స్వస్తి తండ్రి అశోక్ పాండే, సోదరి మాత్రమే ఇంట్లో ఉండిపోగా మిగతాసభ్యులు జార్ఖండ్ కు వెళ్లారు. తండ్రి, సోదరి లేని సమయంలో స్వస్తి పాండే ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలను సూసైడ్ నోట్ లో పేర్కొంది. తన పెళ్లి ఆగిపోతుందన్న విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పలేక బాధను తనలో దిగమింగుకోలేక ఆదివారం సాయంత్రం బలవన్మరణానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు.
చనిపోయే కొన్ని నిమిషాలకు ముందు కాబోయే భర్తతో ఆమె చాలా సమయం ఫోన్ లో సంభాషించిందని, పెళ్లి తనకు ఇష్టంలేదని ఇంజినీర్ చెప్పడంతో తాను ఆత్మహత్యకు పాల్పడుతున్న విషయాన్ని వరుడికి కచ్చితంగా చెప్పి ఉంటుందని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. స్వస్తి సూసైడ్ నోట్ ఆధారంగా విచారణ ప్రారంభించామని పోలీసులు వివరించారు.