లక్నో : విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్ తిరిగి క్లాస్‌లకు హాజరవడంతో బెనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ) విద్యార్ధులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడంతో వర్సిటీ అధికారులు దిగివచ్చారు. విద్యార్ధినుల పట్ల అసభ్యంగా వ్యవహరించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్‌ను దీర్ఘకాలం సెలవుపై వెళ్లాలని వర్సిటీ ఆదేశించింది. జువాలజీ ప్రొఫెసర్ శైల్ కుమార్ చౌబే గత ఏడాది అక్టోబర్‌లో స్టడీ టూర్‌పై ఒడిషాకు వెళ్లిన సందర్భంలో విద్యార్థినులపై వల్గర్ కామెంట్స్ చేయడంతో పాటు వారి పట్ల అమర్యాదకరంగా వ్యవహరించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎస్‌కే చౌబేపై వచ్చిన ఆరోపణలను వర్సిటీ అత్యున్నత నిర్ణాయక సంఘం విచారిస్తుందని, తుది నిర్ణయం వెలువడే వరకూ ఆయనను లాంగ్ లీవ్‌పై పంపినట్టు బీహెచ్‌యూ అధికారులు వెల్లడించారు.
ప్రొఫెసర్‌పై ఫిర్యాదులను కంప్లైంట్స్ కమిటీ పర్యవేక్షిస్తుందని, నివేదిక ఆధారంగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆయనపై చర్యలు తీసుకుంటుందని బీహెచ్‌యూ ఓ ప్రకటనలో పేర్కొంది. గతంలో ప్రొఫెసర్ చౌబేను సస్పెండ్ చేసిన అధికారులు ఈ ఏడాది జూన్‌లో విచారణ చేపట్టారు. అంతర్గత విచారణ అనంతరం యూనివర్సిటీ అధికారులు ప్రొఫెసర్‌ను తీవ్రంగా మందలించి సస్పెన్షన్‌ను ఎత్తివేశారు. ప్రొఫెసర్ తిరిగి క్లాసులకు హాజరవడంతో విద్యార్ధులు ఆందోళనలు చేపట్టడంతో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తన నిర్ణయాన్ని తిరిగి సమీక్షించాలని నిర్ణయించింది. మరోవైపు విద్యార్ధినుల పట్ల అభ్యంతరకరంగా వ్యవహరించిన ప్రొఫెసర్ రాజీనామా చేయాలని ఆయనపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయాలని విద్యార్ధులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment