
చండీగఢ్ : జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు నిర్ణయానికి సంబంధించి తాను ప్రధాని నరేంద్ర మోదీని సమర్థిస్తానని సీనియర్ కాంగ్రెస్ నేత, పంజాబ్ మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడా వ్యాఖ్యానించారు. దేశభక్తి, ఆత్మగౌరవం విషయాల్లో తాను రాజీపడబోనని స్పష్టం చేశారు. భూపీందర్ హుడా ఆదివారం రోహ్తక్‌లో జరిగిన పరివర్తన్ మహా ర్యాలీలో మాట్లాడుతూ ప్రభుత్వం ఏమైనా మంచి పనులు చేపడితే తాను వాటిని సమర్ధిస్తానని చెప్పుకొచ్చారు.
ఇక కాంగ్రెస్ పార్టీ తన మునుపటి ప్రాభవం కోల్పోయిందని వ్యాఖ్యానించారు. హర్యానాలో బీజేపీ నేతృత్వంలోని మనోహర్‌లాల్ ఖటర్ ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాలని, ఆర్టికల్ 370 రద్దు ఘనత మాటున దాక్కోరాదని హితవుపలికారు. మరోవైపు హర్యానాలో తాము ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఆంధ్రప్రదేశ్ తరహాలో స్ధానికులకే 75 శాతం ఉద్యోగాలు కల్పించాలనే చట్టం తీసుకువస్తామని స్పష్టం చేశారు. కాగా త్వరలో జరగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భూపీందర్ కాంగ్రెస్‌ను వీడి సొంత రాజకీయ వేదికను ఏర్పాటు చేస్తారని భావిస్తున్నారు.