పాట్నాలో అమిత్ షా యోగాసనాలు
పాట్నా: బీహార్ రాజధాని పాట్నాలో ఆదివారం జరిగిన యోగా డే కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పాల్గొన్నారు. తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా పాట్నాలోని మొయిన్-ఉల్-హక్ స్టేడియంలో ఇద్దరు ముస్లిం అమ్మాయిల ఆధ్వర్యంలో యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ బీజేపీ నాయకుడు సుశిల్ కుమార్ శిండే, మాజీ కేంద్రమంత్రి సీపీ థాకుర్, అసెంబ్లీలో ప్రతిపక్షనేత నంద్ కిషోర్ యాదవ్లతో పాటూ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ..యోగా విశిష్టతని, చరిత్రలో యోగా ప్రాముక్యతని వివరించారు. యోగాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తేవడంలో ప్రధాని మోదీ ఎంతగానో కృషి చేస్తున్నారని కొనియాడారు.
కేంద్రమంత్రి ఎల్పీ అధినేత రాంవిలాస్ పాశ్వాన్ తన నియోజకవర్గం హాజీపూర్లో జరిగిన యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటీవలే బీజేపీతో పొత్తుకు ఓకే చెప్పిన హిందుస్తానీ అవమ్ మోర్చా అధినేత, మాజీ ముఖ్యమంత్రి జితన్ రాం మంఝీ తన నివాసంలో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. పబ్లిసిటీకి దూరంగా, రోజూ మాదిరిగానే ఇంట్లోనే బీహార్ సీఎం నితీష్ కుమార్ యోగా చేశారు. మరోవైపు బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈకార్యక్రమాన్ని బీజేపీ, మిత్రపక్షాలు రాజకీయంగా వాడుకుంటున్నాయన్న ఆరోపణలు గత కొన్నిరోజులుగా వస్తున్న విషయం తెలిసిందే.