ఔరంగాబాద్ : కేంద్ర పారిశ్రామిక భద్రతా దళ(సీఐఎస్‌ఎఫ్) జవాను ఒకరు తన సీనియర్ సహచరులపై జరిపిన కాల్పుల్లో నలుగురు మృతిచెందారు. బిహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. నబీనగర్ పవర్ జనరేటింగ్ కంపెనీ వద్ద విధులు నిర్వహిస్తున్న బల్వీర్ బుధవారం అర్ధరాత్రి సమయంలో డ్యూటీలు మారుతున్నప్పుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. సెలవుల విషయంలో తీవ్ర వాగ్వాదం తర్వాత తన రైఫిల్‌తో పాతిక రౌండ్ల కాల్పులు జరిపాడు. ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే చనిపోగా, గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. బల్వీల్‌ను జవాన్లు అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. కాల్పులపై సీఐఎస్‌ఎఫ్ సైనిక విచారణకు ఆదేశించింది. అలీగఢ్‌కు చెందిన బల్వీర్ మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి ఇటీవల యోగా కోర్సు చేశాడు.