
హలో.. ఐఎస్ఐలో చేరతావా?
భబువా: 'హలో.. హౌ ఆర్ యూ? వీ హావ్ ఏ గ్రేట్ ఆఫర్ ఫర్ యు. మీరు గనక మా సంస్థలో పనిచేస్తే ఊహించనంత డబ్బు, ఇతర సౌకర్యాలు కల్పిస్తాం' అంటూ కొద్దిరోజుల కిందట తన కొచ్చిన ఫోన్ కాల్ ను తేలికగా తీసుకున్నాడు బిహార్ లోని భబువాకు చెందిన ఇంటర్ విద్యార్థి ముఖేశ్ కుమార్. శుక్రవారం మరోసారి అదే కాల్. ఈ సారి ఆఫర్ అమౌంట్ ను రెట్టింపు చేసిన అవతలివాళ్లు.. తాము పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐకు చెందినవాళ్లమని చెప్పారు. దీంతో కంగుతిన్న ముఖేశ్.. పోలీసులను ఆశ్రయించాడు.
ఈ అనుమానిత ఫోన్ కాల్ పై కేసు నమోదుచేసుకున్న పోలీసులు విషయాన్ని కేంద్ర దర్యప్తు సంస్థలకు చేరవేశారు. 'సదరు ఫోన్ కాల్ పాక్ నుంచే వచ్చినట్లు ప్రాథమికంగా నిర్ధారించుకున్నాం. ఇంటెలిజెన్స్ బ్యూరోతోపాటు ఇతర జాతీయ స్థలకు సమాచారం పంపాం. వారే తదుపరి చర్యలు తీసుకుంటారు' అని భబువా ఎస్సీ హర్ ప్రీత్ కౌర్ మీడియాకు తెలిపారు.
భబువా పట్టణంలోని ఓ కాలేజీలో 12వ తరగతి చదువుతోన్న ముఖేశ్ నిరుపేద. చదువులకయ్యే ఖర్చుల కోసం బట్టల దుకాణంలో పార్ట్ టైమ్ పనిచేస్తుంటాడు. ఇతడి ఆర్థిక పరిస్థితి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత, డబ్బు ఆశ చూపడంద్వారా ముఖేశ్ ను లొంగదీసుకునే ప్రయత్నం జరిగి ఉండొచ్చని స్థానిక పోలీసులు భావిస్తున్నారు.