న్యూఢిల్లీ: భారత్–చైనా సరిహద్దులను కాపాడే జవాన్లు తమ పుట్టినరోజు వేడుకలను పనిచేస్తున్న చోటే జరుపుకునే అవకాశాన్ని ఇండో–టిబెటన్ సరిహద్దు రక్షక దళం(ఐటీబీపీ) కల్పించింది. పుట్టిన రోజు జరుపుకునే జవానుకు సగం రోజు సెలవు ఇవ్వడంతోపాటు యూనిట్ సిబ్బంది సమక్షంలో కేక్ కట్ చేయించి, ఉన్నతాధికారులు బొకే అందజేయనున్నారు. సెలవు, ప్రత్యేక విధుల సమయంలో తప్ప యూనిట్‌లో ఉన్న ప్రతి జవాను కూడా బర్త్‌డే వేడుక జరుపుకోవాలని కోరారు. సిబ్బందిలో ఐకమత్యం, ఆత్మవిశ్వాసం పెంచేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు ఐటీబీపీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని దేశ వ్యాప్తంగా ఉన్న ఐటీబీపీ విభాగాలను కోరింది.
దీని ప్రకారం ఇకపై స్త్రీ లేదా పురుష జవానుకు బర్త్‌డే నాడు సగం రోజు ఇవ్వనున్నారు. ఆ రోజు ఉన్నతాధికారులు బొకే అందించి శుభాకాంక్షలు తెలుపుతారు. యూనిఫాం బదులు తమకు ఇష్టమైన దుస్తులు ధరించి తోటి సిబ్బంది సమక్షంలో కేక్ కట్ చేసే అవకాశం ఇస్తారు. అంతేకాకుండా, తమ సంతానాన్ని దేశ రక్షణ విధులకు పంపినందుకు గాను తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఉత్తరాలు కూడా పంపనున్నారు. దీంతో పటియాలాలోని 51వ బెటాలియన్ కమాండింగ్ అధికారితోపాటు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోహిత్ జిల్లాలో ఉన్న ఐటీబీపీ ‘ఎనిమల్ ట్రాన్స్‌పోర్ట్’విభాగం డీఐజీ సుధాకర్ నటరాజన్ జవాన్ల పుట్టిన రోజు వేడుకలు జరిపారు.
Comments
Please login to add a commentAdd a comment