ఎన్నికల ప్రచార సారథిగా ‘నమో’కు నమస్కారం
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచార పర్వంలో ప్రధాని నరేంద్ర మోదీ పాత్రకు తెరపడింది. రానున్న వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార సారథిగా మోదీని ఎంతమాత్రం ప్రచారం చేయరాదని భారతీయ జనతా పార్టీ అంతర్గతంగా నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ విశ్వసనీయ వర్గాలు తెలియజేశాయి. నమో:మోదీ అంటూ ఆయన జపమే చేయడం వల్ల ఢిల్లీలోనే కాకుండా బీహార్‌లో కూడా పరాజయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చిందన్నది పార్టీలోని పలు వర్గాల అభిప్రాయం. రాష్ట్ర నాయకత్వానికే ప్రాధాన్యత ఇచ్చి, ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగానే ప్రకటించి ఎన్నికల బరిలోకి దిగడం ఉత్తమ మార్గమన్న నిర్ణయానికి పార్టీ కేంద్ర నాయకత్వం వచ్చిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు రానున్న 5 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధాని మోదీని ప్రెజెంట్ చేయకుండా, అంతకుముందున్న పార్టీ వ్యూహాన్నే అనుసరించాలని పార్టీ నిర్ణయించింది. ఒక్క పంజాబ్కు మాత్రం 2017 మొదట్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ వ్యూహంలో భాగంగా ఈ ఏడాదే ఎన్నికలు జరుగనున్న అస్సాం బీజేపీ శాఖ అధ్యక్షుడిగా కేంద్ర క్రీడలు, యువజన సంక్షేమ శాఖ సహాయ మంత్రి సర్వానంద సోనోవాల్‌ను నియమించాలని అధిష్టానం నిర్ణయించింది.
పార్టీ ఎన్నికల ప్రచార కమిటి చైర్మన్ పదవికీ ఆయన్నే నియమించాలని, ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ఆయన్నే ఎంపిక చేయాలని పార్టీ అభిప్రాయపడినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా అస్సాం పార్టీ శాఖకు సోనోవాల్‌నే సారథ్యం వహించారు. అప్పుడు రాష్ట్రంలోని 14 లోక్‌సభ స్థానాలకుగాను ఏడు స్థానాలను బీజేపీ గెలుచుకొంది.
ఎన్నికలు జరుగనున్న మిగతా రాష్ట్రాల శాఖలకు కూడా కొత్త నాయకులను ఎన్నుకోవాలని పార్టీ భావిస్తోంది. ఈ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలనే విషయంలో ఇంతకాలం మీనమేషాలు లెక్క పెట్టడం వల్ల ఆలస్యం జరిగిందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఎలాంటి వ్యూహాన్ని అనుసరించినా పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించే అవకాశాలు లేవు. 2017 సంవత్సరంలో మొదట్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పంజాబ్‌లో శిరోమణి అకాలీదళ్‌తో పొత్తు పెట్టుకోవడం ద్వారా లబ్ధి పొందాలని బీజేపీ భావిస్తోంది.
ఈ నేపథ్యంలో అస్సాం, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికలే పార్టీకి కీలకం కానున్నాయి. మరింత కీలకమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ అధ్యక్షుడిగా అగ్రవర్ణానికి చెందిన వ్యక్తినీ ఎన్నుకోవాలా లేదా ఇతర వెనకబడిన వర్గాల వ్యక్తిని ఎన్నుకోవాలనే అంశాన్ని పార్టీ కేంద్ర నాయకత్వం ప్రస్తుతం యోచిస్తోంది. అన్ని వర్గాల వారిని కలుపుకుపోయే వ్యక్తిని ఎన్నుకోవడమే శ్రేయస్కరమని పార్టీ భావిస్తోందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని పార్టీ సీనియర్ నాయకుడొకరు మీడియాకు తెలిపారు. ఈ రాష్ట్రాలకు కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగానే ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.