న్యూఢిల్లీ: ప్రతిపక్షాలపై దాడి చేయడంలో, వారి ఆరోపణలకు దీటుగా సమాధానం ఇవ్వడంలో మరింత దూకుడుగా వ్యవహరించాలని బీజేపీ అగ్రనాయకత్వం పార్టీ అధికార ప్రతినిధులు, మీడియా విభాగానికి సూచిం చింది. అయితే.. అదే సమయంలో హుందాగా వ్యవహరించాలని, ప్రతిపక్షాలపై చేసే విమర్శల్లో ఔచిత్యాన్ని ప్రదర్శించాలని ఆదేశించింది. శనివారం ఢిల్లీలో బీజేపీ జాతీయ, రాష్ట్ర శాఖల అధికార ప్రతినిధులు, మీడియా విభాగాల సిబ్బందితో ఆ పార్టీ ఒక వర్క్‌షాపును నిర్వహించింది. ఈ సందర్భంగా పార్టీ నేతలు మీడియాతో, విపక్షాలతో వ్యవహరించాల్సిన పద్ధతులపై సీనియర్లు సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీ ప్రసంగించారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలపై ఆరోపణలు, విమర్శలు చేసేప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని సుష్మాస్వరాజ్ సూచించారు.
ఆయా అంశాలపై పార్టీ నేతల వ్యాఖ్యల్లో వైరుధ్యం ఉండకుండా చూసుకోవాలని చెప్పారు. అవినీతి, దేశ ఆర్థిక పరిస్థితి, కుంటుపడిన పాలన తదితర అంశాలపై కాంగ్రెస్ పార్టీని నిలదీయాలన్నారు. మోడీ స్వాతంత్య్రదినోత్సవ ప్రసంగం అనంతరం ఆయనపై కాంగ్రెస్ చేసిన ఆరోపణలను బీజేపీ నేతలు సరిగా తిప్పికొట్టలేకపోయారని అరుణ్‌జైట్లీ అసంతృప్తి వ్యక్తం చేశారు. వర్క్‌షాప్ అనంతరం బీజేపీ సీనియర్ నేత షానవాజ్ హుస్సేన్ మీడియాతో మాట్లాడారు. సల్మాన్ ఖుర్షీద్, ఆజాద్ వంటి కాంగ్రెస్ నేతలు అభ్యంతరకరమైన భాషతో మోడీని ఇతర బీజేపీ నేతలను విమర్శిస్తున్నారని, కానీ తాము అలా వ్యవహరించదలచుకోలేదని వ్యాఖ్యానించారు.