ఢిల్లీ సీఎంఓ కార్యాలయంపై సీబీఐ దాడులు చేయటం.. సమాఖ్య వ్యవస్థపై తీవ్రమైన దాడి అంటూ ప్రతిపక్ష పార్టీలు మంగళవారం
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎంఓ కార్యాలయంపై సీబీఐ దాడులు చేయటం.. సమాఖ్య వ్యవస్థపై తీవ్రమైన దాడి అంటూ ప్రతిపక్ష పార్టీలు మంగళవారం పార్లమెంటులో మండిపడ్డాయి. లోక్‌సభ, రాజ్యసభల్లో తృణమూల్ కాంగ్రెస్ ఈ దాడుల అంశాన్ని ప్రస్తావించింది. దేశంలో అప్రకటిత అత్యవసర పరిస్థితిని విధించారంటూ విపక్షాలు సర్కారుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తటంతో ఉభయసభల్లోనూ తీవ్ర గందరగోళం చెలరేగింది. రాజ్యసభలో విపక్షాల ఆగ్రహం, ఆందోళనలతో సభ మూడుసార్లు వాయిదా పడింది. ‘‘ఇది ఒక పార్టీకి సంబంధించిన అంశం కాదు. దేశంలో సమాఖ్య నిర్మాణానికి సంబంధించిన అంశం’’ అని తృణమూల్ ఎంపీ డెరెక్ ఒబ్రైన్ మండిపడ్డారు.
ప్రతిపక్ష నేత గులాంనబీఆజాద్ ఆయనతో గళం కలుపుతూ.. ప్రభుత్వం రాజ్యాంగాన్ని హత్య చేస్తోందని ధ్వజమెత్తారు. వామపక్ష పార్టీలు, జేడీయూ సభ్యులు కూడా తమ స్థానాల్లో నిల్చుని సర్కారుపై నిరసన వ్యక్తంచేశారు. విపక్షాల ఆందోళనకు ఉభయసభల్లోనూ ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సమాధానం ఇచ్చారు. ఢిల్లీ సీఎం కార్యాలయంపై సీబీఐ దాడులు చేయలేదన్నారు. ఓ సీనియర్ అధికారి అవినీతి కేసులో ఉన్నారని.. ఆయన కార్యాలయంలో మాత్రమే దాడులు జరుగుతున్నాయన్నారు.