'కాంగ్రెస్ పాలన నుంచి విముక్తి పొందండి'
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పాలను నుంచి విముక్తి పొందడానికి ప్రజలు కృషి చేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పిలుపునిచ్చారు. కర్ణాటకలో కమలదళాన్ని పటిష్టం చేసి, పాలక కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు శనివారమిక్కడ నిర్వహించిన కోర్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రజలు కర్ణాటకలో అధికార పార్టీ కాంగ్రెస్ కు స్వస్తి చెప్పాలన్నారు. కేంద్రంలో యూపీఏ పాలనను ఎన్డీఏ చరమగీతం పాడిందన్న విషయాన్ని అమిత్ షా గుర్తు చేశారు. గత బీజేపీ ప్రభుత్వ హయాంలో కర్ణాటకలో అభివృద్ధి రేటు ఐదు నుంచి పది శాతంకు పెరగగా, కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రంలో అభివృద్ధి ఛాయలే కనిపించలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అధికారం చేపట్టాక నిరుద్యోగ రాష్ట్రంగా మారిందన్నారు. రాష్ట్రంలో రైతులు అనేక రకాలైన కష్టాలను అనుభవిస్తున్నారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.