
‘నమో’ జపంతో ప్రజల్లోకి...
బీజేపీ ఎన్నికల నినాదం ‘ప్రధాని పదవికి మోడీ’
పార్టీ పార్లమెంటరీ బోర్డు, సీఎంల భేటీలో నిర్ణయం
272కుపైగా ఎంపీ సీట్ల గెలుపే లక్ష్యం
కాంగ్రెస్ సీట్లపై గురికి మోడీ సూచన
‘ఒక ఓటు-ఒక నోటు’ కింద విరాళాల సేకరణ
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ న.మో (నరేంద్ర మోడీ) జపంతో ప్రజల్లోకి వెళ్లనుంది. ‘మోడీ ఫర్ పీఎం’ (ప్రధాని పదవికి మోడీ) నినాదంతో ఎన్నికల బరిలోకి దిగనుంది. అలాగే పొత్తులపై ఆధారపడకుండా సొంతంగా 272కన్నా ఎక్కువ ఎంపీ సీట్లు సాధించాలని లక్ష్యం నిర్దేశించుకుంది. మంగళవారం ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన జరిగిన ఆ పార్టీపాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్లమెంటరీ బోర్డు సమావేశాల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీతోపాటు, గోవా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులు మనోహర్ పారికర్, వసుంధర రాజె, శివరాజ్‌సింగ్ చౌహాన్, రమణ్‌సింగ్ తదితరులు ఇందులో పాల్గొన్నారు.
పార్టీ సీఎంల సమావేశంలో మోడీ మాట్లాడుతూ 2009 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పార్టీ అభ్యర్థులు తలపడి రెండో స్థానంలో నిలిచిన నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. అదేసమయంలో యూపీఏ ప్రభుత్వంపై పెల్లుబుకుతున్న ప్రజావ్యతిరేకతను ఉపయోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పోలిస్తే మొత్తంగా 89 లక్షల ఓట్లు పార్టీ వెనకబడిందని...ఆ లోటును పూడ్చుకునే చర్యల్లో భాగంగా గత ఐదేళ్లలో నమోదైన 12 లక్షల మంది కొత్త ఓటర్లను కూడా ఆకర్షించేందుకు ప్రయత్నించాలన్నారు. ఈ సమావేశాల అనంతరం పార్టీ ప్రధాన కార్యదర్శి అనంత కుమార్ విలేకరులతో మాట్లాడుతూ మోడీ ఫర్ పీఎం (ప్రధాని పదవికి మోడీ) తమ ప్రచార నినాదంగా పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పారదోలేందుకు ఎమర్జెన్సీ సమయంలో(1975) జయప్రకాశ్ నారాయణ సాగించిన ఉద్యమ తీరులోనే తమ ప్రచారం కూడా ఉంటుందని చెప్పారు. 1977లో వాతావరణం పూర్తిగా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉందని.. ఇప్పుడు కూడా దేశంలో అలాంటి పరిస్థితులే నెలకొన్నాయన్నారు. తమ పార్టీ ప్రచారంలో భాగంగా కార్యకర్తలు 10 కోట్ల కుటుంబాలను కలసి మోడీని గెలిపించాలని అభ్యర్ధించడంతోపాటు ‘ఒక ఓటు ఒక నోటు’ కార్యక్రమం కింద నిధులను కూడా సేకరిస్తారని తెలిపారు. కనీసం 10 రూపాయలు, గరిష్టంగా 1,000 రూపాయల వరకు విరాళంగా ఇవ్వవచ్చని పేర్కొన్నారు.
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి జన్మదినాన్ని పురస్కరించుకుని బుధవారం దేశవ్యాప్తంగా సుపరిపాలన దివస్ నిర్వహించడానికి పార్టీ పిలుపునిచ్చిందని తెలిపారు. కాగా, మంగళవారం సాయంత్రం జరిగిన బీజేపీ జాతీయ పదాధికారులు, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎన్నికల ఏర్పాట్ల కమిటీలతో జరిగిన భేటీలో శివరాజ్‌సింగ్ చౌహాన్, రమణ్ సింగ్, వసుంధర రాజేతోపాటు పార్టీ ఢిల్లీ సీఎం అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ హర్షవర్ధన్‌ను సత్కరించారు. సమావేశంలో జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, నేతలు బండారు దత్తాత్రేయ, హరిబాబు, రవీంద్రరాజు, లక్ష్మణ్ పాల్గొన్నారు. భేటీ అనంతరం బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు 120 రోజుల గడవు ఉందని...ఇందులో 60 రోజులు ఏర్పాట్లకు, 60 రోజులు ప్రచారానికి కేటాయించేలా ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయించామన్నారు. కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ సర్కారు పదేళ్ల చీకటి పాలనపై చార్జీషీట్ రూపొందించడంతోపాటు ఇండియా272.కామ్ పేరుతో వెబ్‌సైట్ ఏర్పాటు, పార్టీ విజన్ డాక్యుమెంట్, మేనిఫెస్టోలను రూపకల్పన చేయనున్నట్లు చెప్పారు.