ఆటోల పర్మిట్ స్కాంకు బాధ్యత వహించి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి గోపాల్ రాయ్ రాజీనామా చేయాల్సిందేనని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ స్కాంలో భాగస్వామేనని, దీనిపై తమ పార్టీ సోమవారం ఢిల్లీ సచివాలయం వద్ద ధర్నా చేస్తుందని చెప్పారు. మరోవైపు స్కాం ఆరోపణలతో.. ఢిల్లీలో ఇంతకు ముందు ఇచ్చిన 932 ఆటోల పర్మిట్లను రద్దు చేస్తున్నామని, మూడింటిని సస్పెండ్ చేస్తున్నామని సీఎం అరవింద్ కేజ్రీవాల్ శనివారం సాయంత్రం ప్రకటించారు.
కేజ్రీవాల్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, తమకు ఇన్నాళ్లూ అతిపెద్ద మద్దతుదారులుగా ఉన్న ఆటో డ్రైవర్లను కూడా మోసం చేస్తున్నారని సతీష్ ఉపాధ్యాయ ఆరోపించారు. ఇంతకుముందు రవాణాశాఖలో మధ్యదళారుల కారణంగా అవినీతి జరిగేదని, కానీ ఇప్పుడు ఆప్ వలంటీర్లు, ఎమ్మెల్యేలే ఆ పని చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ కేసును ఏసీబీకి అప్పగించాలని, రవాణాశాఖ నుంచి నివేదిక తీసుకోవాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్‌ను బీజేపీ కోరింది. పదివేల ఆటోలకు కొత్తగా పర్మిట్లు ఇస్తామని సీఎం ప్రకటించడంతో 17వేల దరఖాస్తులు వచ్చాయని, అక్కడే అవినీతి మొదలైందని సతీష్ ఉపాధ్యాయ అన్నారు.
ఆటో పర్మిట్ స్కాం: మంత్రి రాజీనామా చేయాల్సిందే!
Published Sat, Dec 26 2015 7:15 PM | Last Updated on Sun, Sep 3 2017 2:37 PM
Advertisement