
మోదీతో సెల్ఫీ తీసుకుంటారా?
అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనే యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ సరికొత్త వ్యూహాలు పన్నుతోంది. ప్రధాని నరేంద్రమోదీతో సెల్ఫీ తీసుకోడానికి అవకాశం కల్పిస్తామని చెబుతోంది. ఇందుకోసం ప్రత్యేకంగా 2,500 సెల్ఫీ విత్ మోదీ కేంద్రాలను ఢిల్లీలో ఏర్పాటుచేసింది. ఈ కేంద్రాల్లో మోదీ వర్చువల్గా కనిపిస్తారు. అంటే.. నిజంగా అక్కడ మోదీ ఉండరు గానీ, ఆయన ఉన్నట్లుగా కనిపిస్తుంది. దాంతో సెల్ఫీ తీసుకోవచ్చు. ఈ తరహా మొదటి కేంద్రాన్ని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ప్రారంభించారు. మోదీ పలు సందర్భాల్లో ఎక్కడికక్కడ సెల్ఫీలు తీసుకుంటూ వాటిని ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా వేదికల్లో పోస్ట్ చేస్తుంటారు.
ఫిబ్రబరి 7వ తేదీన ఢిల్లీలో ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలకు ఈ అస్త్రం బాగా పనికొస్తుందని బీజేపీ భావిస్తోంది. యువతలో మోదీకి మంచి క్రేజ్ ఉందని, అందువల్ల ఈ సెల్ఫీ ప్రయత్నం బాగానే ఫలిస్తుందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభిప్రాయపడ్డారు. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేదీ కొన్నిసార్లు రిక్షాల్లో కూడా తిరుగుతున్నారు. రోడ్డుపక్కన టీస్టాళ్లలో చాయ్ తాగుతున్నారు. ఆమె నేరుగా ప్రజలకు అందుబాటులో ఉంటారని, ప్రధాని అయితే అందరికీ దొరకరు కాబట్టి ఇలా సెల్ఫీలు తీయిస్తున్నామని ప్రధాన్ చెప్పారు.