
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉగ్రవాది అంటూ కేంద్ర మంత్రి, బీజేపీ నేత ప్రకాష్ జవదేకర్ సంచలన ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్ ఉగ్రవాది అని నిరూపించేందుకు పలు ఆధారాలున్నాయని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. తాను టెర్రరిస్టునా అంటూ కేజ్రీవాల్ అమాయకుడిలా ఢిల్లీ ప్రజలను అడుగుతున్నారని, అందుకు సమాధానం ఆయన టెర్రరిస్టేనని అన్నారు. గతంలో తాను అరాచకవాదినని కేజ్రీవాల్ స్వయంగా చెప్పుకున్నారని, అరాచకవాదికి, ఉగ్రవాదికి మధ్య పెద్ద వ్యత్యాసమేమీ లేదని జవదేకర్ అన్నారు. కాగా కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై ఆప్ తీవ్రంగా స్పందించింది. ఈ తరహా భాషను వాడిన జవదేకర్‌పై చర్యలు చేపట్టాలని ఆ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఈసీని డిమాండ్ చేశారు.
కేజ్రీవాల్ ఉగ్రవాది అయితే ఆయనను అరెస్ట్ చేయాలని సంజయ్ సింగ్ బీజేపీని డిమాండ్ చేశారు. దేశ రాజధానిలో ఈసీ కొలువుతీరిన ప్రాంతంలోనే కేంద్ర మంత్రి ఇలాంటి భాషను వాడటాన్ని ఎలా అనుమతిస్తారని సింగ్ ప్రశ్నించారు. కాగా ఆప్ తన పార్టీని ముస్లిం లీగ్ అని మార్చుకుంటే మంచిదని అంతకుముందు బీజేపీ నేత కపిల్ మిశ్రా ఆప్‌కు హితవు పలికారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లింల ఓట్ల కోసం ఆప్ టెర్రరిస్టులను వెనకేసుకొస్తోందని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment