భోపాల్ : పొరుగు దేశాల్లోని మైనారిటీలకు జరిగిన చారిత్రక అన్యాయాన్ని సరిదిద్దేందుకే పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) తీసుకువచ్చామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేసిన రోజే సీఏఏను మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే తప్పుపట్టారు. మతం పేరుతో విభజన సరైంది కాదని, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని బీజేపీ ఎమ్మెల్యే నారాయణ్ త్రిపాఠి తేల్చిచెప్పారు. బాబా సాహెబ్ అంబేద్కర్ మన ముందుంచిన రాజ్యాంగాన్ని మనం గౌరవిస్తామా దానికి తూట్లు పొడుస్తామా అన్నది ముందు తేల్చుకోవాలన్నారు. లౌకిక దేశంలో మతం పేరుతో విభజన ఉండరాదని రాజ్యాంగం చెబుతున్నా ఇప్పుడు అదే జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
కేంద్రం తీరుతో ప్రజలు ముఖాలు చూసుకునే పరిస్థితి లేదని, తమ గ్రామంలో హిందూ..ముస్లింలు గతంలో సఖ్యతతో మెలిగేవారని..ఇప్పుడు ముస్లింలు తమను చూసేందుకే ఇష్టపడటం లేదని చెప్పుకొచ్చారు. వసుధైక కుటుంబం గురించి మాట్లాడే మనం ప్రజలను మతపరంగా విడదీస్తే దేశాన్ని ఎలా నడపగలమని ఆయన ప్రశ్నించారు. గ్రామీణ ప్రజలు, పట్టణ పేదలు ఆధార్ కార్డు పొందడమే కష్టంగా ఉన్న క్రమంలో వారు తమ పౌరసత్వాన్ని నిరూపించుకునే పత్రాలను ఎక్కడి నుంచి తేగలరని నిలదీశారు. తాను సీఏఏకు వ్యతిరేకంగా మాట్లాడినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీలో చేరతానని అనుకోరాదని ఆయన స్పష్టం చేశారు. గతంలోనూ త్రిపాఠి పలు సందర్భాల్లో బీజేపీ నిర్ణయాలను వ్యతిరేకించారు.
Comments
Please login to add a commentAdd a comment