
'బాబా'పై వ్యాఖ్యలు; బీజేపీ ఎంపీ యూటర్న్
డేరా సచ్చా సౌదా చీఫ్ బాబా గుర్మీత్ రాం రహీమ్ సింగ్‌కు మద్దతుగా వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ మాట మార్చారు.
న్యూఢిల్లీ: డేరా సచ్చా సౌదా చీఫ్ బాబా గుర్మీత్ రాం రహీమ్ సింగ్‌కు మద్దతుగా వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ మాట మార్చారు. గుర్మీత్‌కు అనుకూలంగా తాను మాట్లాడలేదని అన్నారు. తన మాటలను మీడియా వక్రీకరించిందని చెప్పారు. 'రాం రహీమ్‌కు మద్దతుగా నేను కామెంట్ చేయలేదు. నా మాటలను మీడియా తప్పుగా ప్రసారం చేసింది. రాం రహీమ్‌కు వ్యతిరేకంగా కోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తాను. విశ్వాసం పేరుతో మోసం చేసినవారిపై సాధించిన విజయం ఇది. రాంపాల్, రాం రహీమ్, ఆశారామ్ బాబాలు కాదు. ఇటువంటి వారిని అనుసరించే ముందు ప్రజలు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల'ని సాక్షి మహరాజ్ అన్నారు.
రాం రహీమ్ చాలా నిరాబండర వ్యక్తి అని, ఆయనను వేధింపులకు గురి చేస్తున్నారని అంతకుముందు ఆయన వ్యాఖ్యానించారు. 'న్యాయవ్యవస్థ పట్ల నాకు గౌరవముంది. కోట్లాది మంది రాం రహీమ్‌ను సమర్థిస్తున్నారు. కేవలం ఒక్కరు మాత్రమే ఆయనకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. ఈ ఒక్కరే కరెక్టా? కోట్లాది మంది కరెక్టా?. జామా మసీదుకు చెందిన షాహి ఇమామ్ మీద అనేక కేసులు ఉన్నాయి. రాం రహీమ్‌ను విచారించినట్టుగానే షాహి ఇమామ్‌ను సుప్రీంకోర్టు లేదా హైకోర్టు విచారించగలవా.. ఆయనేమైనా వాటికి చుట్టమా? రాం రహీమ్ నిరాడంబరుడు. అందుకే ఆయనను వేధిస్తున్నార'ని సాక్షి మహరాజ్ ఇంతకుముందు వ్యాఖ్యానించారు. 15 ఏళ్ల క్రితం ఇద్దరు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు రోహతక్ కోర్టు సోమవారం రాం రహీమ్‌కు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.